తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడు : వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వివరణ

Telangana Minister explanation on the comments - Telangana Palita YSR monster:

0
87

ఆంధ్రోడు.. ఆంధ్రోడే, తెలంగాణోడు.. తెలంగాణోడే అంటూ కామెంట్స్ చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య వేడిని రగిలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ వైసిపి నేతలు రోజా, గండికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, బిజెపి నేత సోము వీర్రాజు తదితరులు మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ప్రశాంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. పాలకులను ఉద్దేశించి మాత్రమే తాను కామెంట్ చేశానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ పాలిట రాక్షసుడే అని మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టిన, కడుతున్న పాలకులను ఉద్దేశించి తాను మంగళవారం మాట్లాడినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి అని చెప్పారు. సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా వైఎస్ అడ్డుపడి తెలంగాణ బిడ్డల చావుకు కారణమయ్యాడని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో అరాచకాలకు పాల్పడిన వైఎస్ నిజంగా తెలంగాణ పాలిట రాక్షసుడే అని మరోసారి వ్యాఖ్యానించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించిన వైఎస్ నీటి దొంగే అని నొక్కి వొక్కానించారు.
నేడు వైఎస్ ను మించి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ ను ఏమనాలో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడానికి ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఎపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.