తెలంగాణ రాష్ట్రం దయ దాక్షిణ్యాలతో రాలేదు: TUWJ నేత విరాహత్

0
82
తెలంగాణ రాష్ట్రం దయ దక్షిణ్యలతో రాలేదని TUWJ నేత విరాహత్ అభిప్రాయాన్ని తెలియజేశారు.  సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ పార్టీల దయ, దక్షిణ్యంతో తెలంగాణ రాష్ట్ర విభజన జరగలేదని, దాదాపు ముప్పై ఏండ్ల ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలతో ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు.
సోమవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యాయన వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విరాహత్ అలీ మాట్లాడుతూ, సమైక్యవాద ప్రాంతీయ పార్టీలు మినహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సమ్మతితో దేశంలో అత్యున్నత చట్టసభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు పై ఇటీవల రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అప్రజాస్వామ్యంగా, అగౌరవంగా ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ది, ఆదిపత్యం, ఓ ప్రాంత రాజకీయుల మన్ననల కోసం మాత్రమే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసారని, గౌరవ ప్రదమైన ప్రధాని హోదాలో అలాంటి వివాదాస్పద మాటలు సరైనవి కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మోదీకి కొత్తేమి కాదని, గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యటించిన సందర్భంలో తల్లిని చంపి పిల్లను బ్రతికించుకున్నారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు విరాహత్ గుర్తు చేశారు.
తెలంగాణ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెప్పర్ స్ప్రే చేయించిందని, మైకులు కట్ చేసిందనే మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అలాంటి చేష్టలకు పాల్పడింది కొందరు సమైక్యవాదులేననే విషయాన్ని మరచిపోవడం విచారకరమన్నారు. రాజకీయాలను రాజకీయాలతో తేల్చుకోవలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల గుండెలకు గాయాలు కలిగించే విధంగా కాదన్నారు. పవిత్రమైన రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతర కరమైనవేనని విరాహత్ ఖండించారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలు అసూహ్యపడే విధంగా ఉందన్నారు.
రాజ్యాంగమంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో కాదని, దేశంలో ప్రజాస్వామ్యన్ని రక్షించే పవిత్ర గ్రంథమని విరాహత్ స్పష్టం చేశారు. రాజకీయలబ్ది కోసం ప్రజల్లో ఆందోళన చేకూర్చే వ్యాఖ్యలకు రాజకీయులు స్వస్తిపలకాలని ఆయన సూచించారు. వేదిక అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, వేదిక బాధ్యుడు సాదిక్ లతో పాటు పలు ప్రజా సంఘాల బాధ్యులు, ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు.