నేడు తెలుగుతేజం సాయితేజ అంత్యక్రియలు

Telugutejam Saiteja funeral today

0
94

తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగుతేజం లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు నేడు జరగనున్నాయి. భౌతికకాయం స్వగ్రామం వచ్చేందుకు ఆలస్యమవటంతో శనివారం జరగాల్సిన అంత్యక్రియలు నేటికి వాయిదా పడ్డాయి.

ప్రజల సందర్శన అనంతరం సైనిక లాంఛనాలతో నేడు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం సాయితేజను గుర్తించినా పార్థివదేహం దిల్లీ నుంచి బెంగళూరుకు తరలించే సరికి నిన్న సమయం మించిపోయింది. సైనికాధికారుల నివాళుల అనంతరం బేస్ క్యాంప్ మార్చురీలో పార్థివదేహాన్ని భద్రపరిచారు.

నేడు ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో కుటుంబసభ్యులకు సాయితేజ పార్థివదేహాన్ని సైనిక అధికారులు అందజేయనున్నారు. వీర జవాన్‌కు కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల వద్దే ఘనంగా నివాళులు అర్పించి ద్విచక్రవాహనాలతో ర్యాలీగా స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కు ద్వారా అందజేశారు.