తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మనిపంపులలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారితో మాట్లాడారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా.. అక్కడికి తెరాస కార్యకర్తలు వచ్చారు.
బండి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస వైఫల్యాలు ఎండగడుతున్నామన్న భయంతోనే తెరాస కార్యకర్తలు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బండిసంజయ్ రచ్చబండలో ఎస్సీల సమస్యలపై ప్రస్తావించారు.
అదే సమయంలో అక్కడున్న తెరాస కార్యకర్తలు కేంద్రప్రభుత్వం ఎస్సీలకు ఏమిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులేమిటో చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు. దీంతో కాసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుండి పంపారు.