హుజురాబాద్ లో ఉద్రిక్తత..ప్రైవేటు వాహనంలో వీవీప్యాట్‌ తరలింపు

Tension in Huzurabad..Vivipat‌ move in private vehicle

0
212

హుజూరాబాద్‌లోప్రైవేటు వాహనంలో వీవీ ప్యాట్‌ తరలింపు ఆందోళనకు దారి తీసింది. పోలింగ్‌ ముగిశాక…భారీ భద్రత మధ్య తరలించాల్సిన వీవీ ప్యాట్​ని ఓ వ్యక్తి ప్రైవేటు వాహనంలో తీసుకువెళ్లడం చర్చనీయంగా మారింది. ప్రభుత్వ వాహనంలో తరలించాల్సిన దీనిని రాత్రివేళ ప్రైవేటు వాహనంలో ఎలా తరలిస్తారంటూ..భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.

నేతల మాటల యుద్ధం, డబ్బు పంపిణీ ఆరోపణల మధ్య హోరెత్తిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక శనివారం సాయంత్రం 7గంటలకు ముగిసింది. రాత్రి జమ్మికుంట వద్ద నుంచి ప్రైవేటు వాహనంలో వీవీ ప్యాట్‌ తరలిస్తుండగా..గుర్తించిన కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అడ్డుకున్నారు. వీవీ ప్యాట్​ని ఆర్టీసీ బస్సులో కాకుండా వేరే వాహనంలో తీసుకెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ…కార్యకర్తలతో కలిసి వాహనాన్ని అడ్డుకున్నారు. బస్సు టైరు పంక్చర్‌ కావడం వల్ల యంత్రాన్ని కారులో తరలిస్తున్నట్లు సదరు వ్యక్తి చెబుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను కాంగ్రెస్‌, భాజపా నాయకులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. కాగా వీవీ ప్యాట్‌ తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీవీ ప్యాట్‌ తరలింపుపై రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. పనిచేయని వీవీ ప్యాట్‌ను తరలిస్తుండగా వీడియో తీశారన్న రిటర్నింగ్‌ అధికారి… మరో వాహనంలోకి తరలిస్తుండగా రికార్డు చేశారని స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రకటించారు.