జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వేళ రాజమండ్రిలో టెన్షన్ వాతవరణం నెలకొంది. దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేస్తామని పవన్ కల్యాణ్ ఎప్పుడైతేప్రకటించారో..అప్పటి నుండి ఈ ఉత్కంఠ రేగుతోంది. ఆ కార్యక్రమానికి భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఇవాళ్టి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలోని హకుంపేట రోడ్డులో గంతలు పూడ్చే శ్రమదానం కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. కార్యకర్తలను అడ్డుకుంటూ ఇలా బారికేడ్లు ఏర్పాటు చేయడం ఏంటని జన సైనికులు ప్రశ్నిస్తూ బారికేడ్లను దాటుకుంటూ ముందుకు వచ్చారు. పవన్ భద్రత కోసమే ఈ ఏర్పాట్లు చేశామని, కేవలం సభలో ప్రసంగించడానికి అనుమతి ఇచ్చామంటూ పోలీసులు తెలిపారు. గాంధీ జయంతి నాడు శాంతియుతంగా జరుపుకునే కార్యక్రమాన్ని అడ్డుకోవటం ప్రభుత్వ పిరికి చర్య అని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.