ఆ బాధ్యత ఉపాధ్యాయులదే: మంత్రి సత్యవతి

That responsibility rests with the teachers: Minister Satyavati

0
103
Minister satyavathi rathod

కోవిడ్ -19 నేపథ్యంలో తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభించుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.

గిరిజన విద్యాసంస్థల పున: ప్రారంభంపై గిరిజన శాఖ అధికారులతో మంత్రి నేడు హైదరాబాద్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..కోవిడ్ వల్ల పాఠశాలలు మూతపడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారన్నారు. గురుకులాల్లో చేరడానికి చాలా డిమాండ్ ఉందని చెప్పారు. విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలలో ఉండే గిరిజనుల ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు.

ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దని చెప్పారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. గిరిదర్శిని కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న అంగన్ వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, గ్రామాల్లోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు.

కోవిడ్ వల్ల మూతపడ్డ విద్యా సంస్థలలో గత నెల రోజులుగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయని, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, అన్ని మరమ్మత్తులను వెంటనే చేపట్టాలన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు 20 వేల రూపాయల ఇంతకు ముందే ఇచ్చినట్లు చెప్పారు. ఆహార పదార్థాలకు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసీసీ) ద్వారా సమన్వయం చేయాలన్నారు.

విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచే విధంగా హెల్త్ కమాండ్ సెంటర్ ను నిర్వహించాలన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.