దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన”ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
పీఎంజీకేఏవై పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుతో ప్రభుత్వంపై రూ.53,344.52 కోట్ల భారం పడనుంది.
కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది నుంచి పీఎంజీకేఏవై పథకాన్ని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ రేషన్ పంపిణీ జరుగుతోంది. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తూ వస్తోంది.