140 రోజులకు స్వగ్రామానికి మృతదేహం

0
90

బ్రతకడానికి సౌదీకి వెళ్లిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రతుకు దెరువు కోసం వెళితే అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ మృతదేహం స్వగ్రామానికి చేరడానికి నానా తంటాలు పడుతున్నారు. తాజాగా సౌదీలో మృతి చెందిన ఓ వ్యక్తి డెడ్ బాడీ స్వగ్రామం చేరడానికి ఏకంగా 140 రోజులు పట్టింది. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన అల్లే రాజేందర్ నాలుగున్నర నెలల క్రితం (09 ఫిబ్రవరి, 2022న) గుండెపోటుతో సౌదీలో మరణించాడు. మృతి చెందిన 140 రోజులకు బుధవారం (29.06.2022) నాడు శవపేటిక స్వగ్రామానికి చేరింది. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని మృతుని బంధువులు, స్థానిక నాయకుడు నిశాంత్ కార్తికేయ ద్వారా ఎంపీ అరవింద్ కి తెలుపగా.. ఎంపీ సమన్వయంతో గల్ఫ్ జెఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి మృతదేహం తెప్పించడానికి కృషి చేశారు.

బుధవారం ముత్యంపేటలో.. గల్ఫ్ కార్మికుడు అల్లె రాజేందర్ అంతిమ యాత్రలో గల్ఫ్ జెఏసి అధ్యక్షులు గుగ్గిల్ల రవి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తోట ధర్మేందర్, చింతలఠానం ప్రవీణ్,ముస్కెమ్ సంజీవ్, కసారపు రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్థివ దేహంపై గల్ఫ్ జెఏసి జెండాను కప్పి నివాళులు అర్పించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అంతిమయాత్రలో వారు ప్లకార్డులను ప్రదర్శించారు.