యాదగిరి గుట్టపైకి జర్నలిస్టులకు అనుమతి లేకపోవడం దారుణం…TUWJ

0
79

యాదగిరిగుట్ట పరిధిలో ఘోర ఉద్రిక్తత నెలకొంది. జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంతో జర్నలిస్ట్ సంఘం ఆందోళనకు దిగారు. మీడియా వాహనాలను గుట్టపైకి  వెళ్ళడానికి అనుమతించక పోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొండపైకి ఉద్యోగాలు చేసే వారి వాహనాలను అనుమతించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

యాదగిరిగుట్టపై వార్త సేకరణకి వెళ్ళే జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, తెంజూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్, రమణ కుమార్ లు తీవ్రంగా ఖండించారు.

యాదగిరిగుట్ట పై మీడియా పాయింట్ పెట్టిన ఆలయ కార్యనిర్వహణాధికారి గీత అక్కడికి మీడియా వాహనాలను మాత్రం అనుమతించమని ,బస్ లలో కవరేజ్ కు రావాలని చెప్పడం ఎంత మాత్రం సహేతుకంగా లేదన్నారు. కొండపైన ఉద్యోగాలు చేసే వారి వాహనాలను అనుమతించే అధికారులు అదే విధి నిర్వహణ కోసం జర్నలిస్టు మీడియా పాయింట్ కి వెళ్లడానికి అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

వెంటనే ఈ విషయం పై ఆలయ కార్యనిర్వాహణ అధికారి సానుకూలంగా నిర్ణయం తీసుకొని మీడియా వాహనాలను అనుమతించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కల్పించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేటాయించినట్లు అన్ని పత్రికల, ఛానళ్ల ప్రతినిధుల కోసం కాటేజీలు సైతం కేటాయించాలన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.