అమెరికా సేనలు అఫ్గనిస్తాన్ ను వీడిన తర్వాత అక్కడ తాలిబన్ల పాలన మొదలైంది. దీంతో అక్కడ ప్రజలు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక చాలా మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇంకొందరు అవకాశం లేక అక్కడే ఉంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందా అని చాలా మంది భయపడుతున్నారు. అయితే మేము మారిపోయాం అని నీతి మాటలు చెబుతున్న తాలిబన్ల మాటలు నీటి మూటలు గా మారాయి.
ఇప్పటికే షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల పట్ల కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. విద్యాలయాల్లో కొత్త ఆంక్షలు అమలు చేస్తున్నారు. 1990 లో తాలిబన్లు అఫ్గనిస్తాన్ ను పాలించినప్పుడు అమలు చేసిన కఠిన శిక్షలు ఇప్పుడు కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు అందరికి భయంగా మారింది.
తాలిబన్ల సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దిన్ తురాబీ మాట్లాడుతూ. గతంలో బహిరంగ శిక్షలు అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శించాయని, మేమే ఆయా దేశాల్లో వారు విధిస్తున్న శిక్షల గురించి ఎప్పుడూ అడగమని గుర్తు చేశారు. తమ దేశ విషయాల గురించి మరో దేశాలు పట్టించుకోవక్కర్లేదు అన్నారు. తప్పులు చేస్తే ఇప్పుడు కూడా కఠిన శిక్షలు అమలు చేస్తాం. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమలు చేస్తామని, అయితే ఆ శిక్షలను బహిరంగా అమలు చేయాలా లేదా అనే విషయం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ మాటలు అక్కడ ప్రజలకు షాక్ కలిగిస్తున్నాయి.