RRR ఉత్తర భాగంలో 11 జంక్షన్లు ఇవే !

ఉత్తరభాగం రోడ్ నిర్మాణంలో భాగంగా 11 చోట్ల జంక్షన్లను నిర్మించడానికి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం

0
83

హైదరాబాద్ కు మరో మణిహారంగా పిలబడే రీజనల్ రింగ్ రోడ్  (RRR) కు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కు అవతల 334 కిలోమీటర్ల పొడవునా నెలకొల్పుతున్న ఈ రహదారిని ఉత్తర భాగంగాను, దక్షిణ భాగం గానూ రెండుగా విభజించి పూర్తి చేయనున్నారు. 158.65 కిలోమీటర్ల పొడవైన ఉత్తరభాగం రోడ్ నిర్మాణంలో భాగంగా 11 చోట్ల జంక్షన్లను నిర్మించడానికి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. 11 చోట్ల జంక్షన్లు నిర్మించాలనే విషయమై మూడు నెలల క్రితం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన కేంద్రం స్వల్ప మార్పులను సూచించింది. మార్పులు చేర్పులతో మరోదఫా ప్రతిపాదనలను రాష్ట్రప్రభుత్వం పంపింది. ప్రస్తుతం దానిపై అధ్యయన ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే 11 జంక్షన్లకు సూత్రప్రాయంగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల నుంచి అందిన సమాచారం.
జంక్షన్లు ఎక్కడెక్కడ వస్తాయంటే ?

గిర్మాపూర్
శివంపేట్
పెద్దచింతకుంట
ఇస్లాంపూర్
నెంటూరు
ప్రజ్ణాపూర్
పీర్లప్లలి
దత్తాయిపల్లి
రాయిగిరి
రెడ్లరేపాక
చౌటుప్పల్
ఉత్తరభాగంలో ఈ 11 జంక్షన్ల నిర్మాణం కోసం 780 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని గుర్తించారు. భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఖర్చును భరించనున్నాయి. అయితే రోడ్ నిర్మాణ వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భారతమాల పథకం కింద భరించనుంది.
ఉత్తర భాగం త్రిబుల్ ఆర్ నిర్మాణం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా 158.65 కిలోమీటర్ల మేర తొలిదశలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇక దక్షిణభాగానికి సంబంధించిన రహదారి నిర్మాణం విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దక్షిణ భాగంలో త్రిబుల్ ఆర్ నిర్మాణంపై ఇప్పటికే రెండుసార్లు ట్రాఫిక్ రద్దీ అధ్యయనం కూడా పూర్తి చేశారు. దక్షిణభాగానికి జాతీయ రహదారి నెంబరు కేటాయిస్తేనే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి రంగం సిద్ధం అవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుకు రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.