తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రెండు విడతలుగా రూ.10000 ఖాతాలో జమ చేస్తుంది. ఇక తాజాగా యాసంగి పెట్టుబడి సాయానికి సంబంధించి నిధులు నిన్నటి నుండి జమ అవుతున్నాయి.
ఇవాళ రూ.1255.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమ అయినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. నిన్న, నేడు కలిపి రూ.1799.99 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..గత ఏడేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో వ్యవసాయం ముందుకెళ్తుంది. సాగు, పంట ఉత్పత్తులు పెరగడంతో అనేక రంగాలకు ఉపాధి లభించింది. వ్యవసాయాన్ని వ్యాపారరంగంగా కాకుండా ప్రభుత్వాలు ఉపాధిరంగంగా చూడాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. దేశంలో అలా చూసిన ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే వ్యవసాయ రంగం మీద దృష్టి సారించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.60 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెడుతున్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయినా రైతుల కోసం రైతుబంధు వంటి వ్యవసాయ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు.