రేవంత్ రెడ్డి డెడ్ లైన్ : ఆ ముగ్గురిలో ఎవరికి ?

0
125

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాడి కౌషిక్ రెడ్డి ఎపిసోడ్ కొత్త చర్చకు జీవం పోసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కౌషిక్ రెడ్డి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తొలుత కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పిన కౌషిక్ తుదకు కారెక్కబోతున్నారు. ఇక ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ మారడంతో రేవంత్ రెడ్డి మైలేజీ పాతాళానికి పడిపోతుందని టిఆర్ఎస్ ఆశపడింది. కానీ రేవంత్ రెడ్డి ఈ పరిణామాన్ని వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలచుకున్నారు. పైగా పాడి కౌషిక్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యఖ్యలు చేశారు.

‘‘ఇంటి దొంగలకు వార్నింగ్ ఇస్తున్నా… నెలరోజులు టైం ఇస్తున్నా.. ఉంటే బుద్ధిగా పడి ఉండండి. లేదంటే పారిపోండి. ద్రోహం చేస్తూ అలాగే ఉంటానంటే మాత్రం పరిగెత్తించి కొడతాము..’’ అని రేవంత్ రెడ్డి సూటిగా, ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇంటిదొంగలు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. పాడి కౌషిక్ రెడ్డి ఎలాగూ వెళ్లిపోయారు కనుక ఇంకా ఇంటి దొంగలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అన్నది చర్చనీయాంశమైంది.

ఇంతకూ రేవంత్ రెడ్డి ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్లు? ఆయన పిసిసి చీఫ్ అయిన తర్వాత వ్యతిరేకించిన వారిని ఇంటిదొంగలుగా అనుకోవచ్చా? లేదంటే ఆయనను పిసిసి చీఫ్ కాకుండా తొలినుంచీ వ్యతిరేకించి అధిష్టానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసిన వారిని ఇంటిదొంగలు అనుకోవచ్చా? లోతుగా పరిశీలన చేస్తే… అనేక అంశాలు తెరమీదకొస్తున్నాయి.

రేవంత్ పిసిసి చీఫ్ కాకముందు చాలామంది నేతలు వ్యతిరేకించారు. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, వి.హన్మంతరావు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. కానీ వన్స్ అధిష్టానం పిసిసి అనౌన్స్ చేసిన తర్వాత అందరూ నోరు మూశారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తన ఆగ్రహాన్ని ఎయిర్ పోర్ట్ లోనే కక్కేశారు. ఓటుకు నోటు కేసులాగే పిసిసి పోస్టు అమ్ముడుపోయిందన్నారు. తనను కలిసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత స్వరం సవరించుకున్నారు. పార్టీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ మళ్లీ రేవంత్ రెడ్డి చిన్నపిలగాడు అంటూ కామెంట్ చేయడమే కాకుండా కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రేవంత్ ఎంపికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక విహెచ్ అయితే రేవంత్ పిసిసి చీఫ్ అయ్యే ముందురోజు వరకు కూడా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఎన్ని తిట్టినా సరే.. రేవంత్ రెడ్డి వెళ్లి విహెచ్ ను పరామర్శించి వచ్చారు. హన్మంతన్న సలహాలు సూచనలు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తానని ప్రకటించారు. మరి విహెచ్ ఇంకా వ్యతిరేకిస్తూనే ఉంటారా? లేదంటే రేవంత్ తో కలిసి నడుస్తారా అన్నది ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత తేలాల్సిన ముచ్చట.

ఇక కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంలేదు. వెంకటరెడ్డి లాగా దూకుడుగా రేవంత్ ను వ్యతిరేకించడంలేదు. అయితే తాను ఏ పార్టీలో ఉంటానన్నది మాత్రం భవిష్యత్తులో తేల్చుకుంటానంటూ ఒక ఆప్షన్ మాత్రం తన ముందు పెట్టుకుంటున్నారు.

ఇక పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీనికి మూడు కారణాలు కనబడుతున్నయి. 1 ఉత్తమ్ సోదరుడే అయిన పాడి కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కబోతుండడం. 2 ఉత్తమ్ ఎప్పటినుంచో టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు రేవంత్ రెడ్డి గతకొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ ఉత్తమ్ టిఆర్ఎస్ మైత్రి కొనసాగుతుందేమో అన్న అనుమానాలతోనే రేవంత్ రెడ్డి ఇలా ఇంటి దొంగల కామెంట్ వాడారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఆదిలాబాద్ టూర్ లో రేవంత్ రెడ్డి ఇంకో మాట ఏమన్నారంటే… ‘‘నేను జానారెడ్డి అంత సీనియర్ ను కాను.. ఆయనంత మంచివాడిని కూడా కాను’’ అనేది. అసలు జానారెడ్డితో ఎందుకు పోల్చుకున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవేళ పోల్చుకుంటే నిన్నటి వరకు పిసిసి చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ తో పోల్చుకాలి. కానీ సంబంధం లేని జానారెడ్డితో ఎందుకు పోల్చుకున్నారు అనేది తేలాల్సి ఉంది.

మొత్తంగా చూస్తే… కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలే రేవంత్ రెడ్డి ‘‘ఇంటి దొంగలు’’ అనే మాటలకు కారణమా అన్న అనుమానాలైతే పార్టీ నేతల్లో కలుగుతన్నాయి.