కేటిఆర్.. మీ తాత పేరు పెట్టుకో : చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

0
89

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన మాటల్లోనే చదవండి…

31 అక్టోబర్ 2017 లో టీడీపీ కి రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్ లో లేఖ రాశా. గన్ మెన్లను ఎస్పీకి సరెండర్ చేశా. పీఏను సరెండర్ చేశా. బ్యాంకు ఖాతాను క్లోజ్ చేశా. పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నందుకే స్పీకర్ ను కలవలేదు. నాకు టీడీపీ ద్వారా ఎమ్మెల్యే పదవి వచ్చింది.. అందుకే పార్టీ అధ్యక్షుడికే రాజీనామా లేఖ ఇచ్చాను. నేను టీడీపీ అయితే.. కేసీఆర్ ఏంటి..? నేను చంద్రబాబు కు సహచరునిగా పని చేశా.. కానీ కేసీఆర్ బానిస బతుకు బతికాడు. ఇప్పుడున్న కేబినెట్ మొత్తం టీడీపీ నే కదా? కేసీఆర్, సబితమ్మ, తలసాని, ఇంద్రకరణ్, పోచారం, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్ ఇలా అందరూ టీడీపీ వాళ్లే కాదా? ఈ రోజు గతి లేక టీడీపీ నుంచి ఎల్.రమణను తీసుకున్నరు.

కేడీఆర్.. (డ్రామా రావు) నోరు తెరిస్తే అబద్ధాలు.. అందుకే డ్రామారావు అని అతడిని పిలుస్తా. కేటీఆర్ కు నిజంగా సిగ్గు, శరం ఉంటే ఆంధ్ర వాళ్ల పేరు తీసేసి.. వాళ్ల తాత పేరు రంగారావు పేరు పెట్టుకోవాలి. భార్య , పిల్లలను తీసుకుపోయి.. సోనియా గాంధీ కాళ్ల మీద పడి పార్టీ ని విలీనం చేస్తానని మోసం చేశాడు కేసిఆర్. మోసం, దోపిడీ కి మారు పేరు కల్వకుంట్ల కుటుంబం. కేటీఆర్ కు తారకరామారావు పేరు పెట్టుకునే అర్హత లేదు. అరువు తెచ్చుకున్న పేరు పెట్టుకొని ఇతరులను ప్రశ్నిస్తాడా? నాకు పీసీసీ పదవి వస్తే సంతోషం. ప్రపంచానికి అధినేత అయినంత సంతోషం వచ్చింది కేటీఆర్ కు ఏం నొప్పి. కేటీఆర్ లాగా తండ్రి నుంచి పదవులు తెచ్చుకోలేదు. నేను స్వంతంగా కష్టపడి పీసీసీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగాను. నేను పీసీసీ పైసలు పెట్టి కొంటే.. వాళ్ల అయ్య కేంద్ర మంత్రిని కూడా కాంగ్రెస్ కు ఎన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్నడు. శాసనసభాపక్షం విలీనం చేసే అర్హత లేదు. రాజ్యాంగం లో కూడా లేదు. కేవలం రాజకీయ పార్టీ లను విలీనం చేయవచ్చు. స్పీకర్ తనకు లేని అధికారాలను ఉన్నాయంటూ రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ లు రాజకీయ పార్టీలు చేయవు.. విచారణ సంస్థలు చేస్తాయి.

కోర్టులలో వేసిన కేసుల వల్ల .. విచారణ సంస్థలు అందిన సమాచారం ప్రకారం వేస్తారు. ఫిర్యాదు ను బట్టి.. ప్రాథమిక సమాచారం ప్రకారం వేస్తారు. విజయమ్మ.. ఎమ్మెల్యే గా పని చేసింది. ఆమెకు తెలవకపోతే ఆమె కొడుకు ఏ -1, ఇంకొకరు ఏ-2 ఉన్నారు.. వాళ్లను అడిగి తెలుసుకోవాలి. ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్న ప్రతీ ఒక్కరూ నేరస్తులు కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి రిలయన్స్ కారణమని.. పెట్రోల్ పంపు తగలబెట్టారు. మీరే ఈ రోజు.. రిలయన్స్ సంస్థకు రాజ్యసభ ఇస్తారు. చార్జ్ షీట్ లలో రాజశేఖర్ రెడ్డి పేరు లేదు కదా? ఎఫ్.ఐ.ఆర్ లో మేము పేరు పెట్టినట్లయితే.. చార్జ్ షీట్ లో మేమే తీసేశామా? కాంగ్రెస్ ను తప్పుదోవ పట్టించే ముందు.. రిలయన్స్ కు ఎందుకు పదవి ఇచ్చారో చెప్పాలి. రాజశేఖర రెడ్డి నెరవేరని చివరి కోరిక.. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయాలనేది. ఆయన చివరి కోరికను మీరు నెరవేరుస్తరా లేదా చెప్పండి. టీ.ఆర్.ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లను వదిలేది లేదు. మునుముందు వాళ్ల అంతు చూస్తాం. నీళ్ల పంచాయతీ ఎక్కడిది.. రెండు రాష్ట్రాల మధ్య సురభి నాటకం ఆడుతున్నారు. అంత చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కృష్ణా బోర్డు మీటింగ్ హాజరయ్యేవారు. ఏపీకి కేటాయించిన 512 టీఎంసీ లు ఎక్కడెక్కడ వాడాలో లెక్కుంది. మొత్తం శ్రీశైలం నుంచి తీసుకెళ్లాలని ఉందా. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడగటం లేదు. ఇప్పటి వరకు 1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క ప్రాజెక్టు పూర్తయ్యిందా.

ఘర్ వాపసీ కార్యక్రమం అనేది అమ్మడు పోయిన నేతల విషయంలో కాదు. ఏదైనా ఒత్తిడి కారణంగా వెళ్లిన వారి కోసమే. ఈటల రాజేందర్ స్వతంత్రంగా నిలబడి కొట్లాడి ఉంటే ఉద్యమకారుడని గుర్తింపు ఉండేది. ఈటెల బీజేపీ లో చేరిన తర్వాత.. ఇంకెక్కడిది. తల్లి ని చంపి బిడ్డను బతికించారని నరేంద్ర మోదీ చెప్పినప్పుడే అయిపోయింది. ఇంకా ఉద్యమం ఎక్కడిది. హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ని కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నిర్ణయిస్తారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. 2022 ఆగష్టు 15 తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికల కు వెళ్తాడు. తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు లో వంద కోట్ల దోపిడీ జరిగింది. అత్యంత పవిత్రమైన అమరవీరుల స్థూపం నిర్మాణం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. తెలంగాణ పై కేసీఆర్ కు ఎలాంటి ప్రేమ లేదు.. అంతా దోపిడీ నే.. నిజంగా ప్రేమ ఉన్నది శ్రీకాంతాచారి, ఇషాన్ లకు. కేసీఆర్ కు నిజంగా ప్రేమ ఉంటే సచ్చిపోయే వారు. షర్మిల ఎవరి బాణం అనేది తెల్వదు.. నాకు తెలిసినంత వరకు జగన్ ను వదిలేసిన బాణం అని చెప్పగలను.