Breaking News: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

0
60

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా..ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా దగ్గర రేవంత్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ అయితే.. చంపించింది బీజేపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు.. అలాగే గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులా? చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. ఇది నా పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నది.. రాజకీయాల కోసం కాదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి పోలీసులను సూటిగా ప్రశ్నించారు.

పోలీసుల కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోతే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించకుండా.. అమిత్ షా దగ్గరకు వెళ్లారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే అల్లర్లు చేయించిందని కొందరు బీజేపీ నేతలు చిల్లరగా వాగారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో జరిగిన అల్లర్లు కూడా తెలంగాణ కాంగ్రెస్ చేయించిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.