ఆయనతో నాకు విబేధాలు లేవు : రేవంత్ రెడ్డి క్లారిటీ

0
111

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు సాధించేందుకు ఒక్కో అడుగు ఆచితూచి వేస్తున్నారు. రేవంత్ కు పిసిసి చీఫ్ పదవి ఇస్తే పార్టీ మొత్తానికి మొత్తం ఖాళీ అయితదని, లీడర్లంతా పార్టీకి గుడ్ బై చెప్తరని ప్రచారం జరిగినా… ఆచరణలో ఒక్క కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తప్ప పెద్ద, చిన్న లీడర్లు ఎవరూ పోలేదు. దీంతో అందరినీ కలుపుకుపోయే క్రమంలో గతంలో విబేధాలు, అభిప్రాయ బేధాలు ఉన్న లీడర్లను సైతం రేవంత్ కలుస్తున్నారు. వారితో కలిసి పనిచేస్తానని ప్రకటిస్తున్నారు.

తాజాగా ఆదిలాబాద్ జిల్లా కీలక నేత ప్రేమ్ సాగర్ రావుకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ జెండా దించకుండా మోసిన వారే నా బంధువులు అని ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ ను చంపుకుని సోనియా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి అని పునరుద్ఘాటించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదని తెలిపారు. కానీ వచ్చిన స్వరాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ ప్రతీ మనిషిమీద లక్ష రూపాయల అప్పు తెచ్చారని ఆరోపించారు. ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్ కు పథకాలు గుర్తుకొస్తున్నా యని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా అని నిలదీశారు. మిగిలిన 118నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనుల కు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆగస్ట్ 9నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని ప్రకటించారు. ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా మోగిస్తామన్నారు.