తెలంగాణ” హుజురాబాద్ ఉపఎన్నిక దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు..ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న ఇరుపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ కామెంట్స్ చేశారు. ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నామో..ఆ యువత ఆకాంక్షల సాధన కోసమే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించాం.ఈ ఆలోచనలో భాగంగా యువకుడైన వెంకట్ ను బరిలోకి దించాం. మమ అనిపించడానికి తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోవడం లేదు.
టీఆర్ఎస్, బీజేపీ నేతలు మూటలు, ముల్లెలు సందు సందున సారా సీసాలు పంచుతోంది. ఐదు నెలలుగా కాంగ్రెస్ ఎందుకు అభ్యర్థిని పెట్టలేదని అందరూ అనుకుని ఉంటారు. మా పోటీ ప్రజా సమస్యలపై మాత్రమే. కేసీఆర్, మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగీ పట్టి అడిగేందుకే వచ్చాం. అక్రమ సంపాదన కాంగ్రెస్ నాయకుల దగ్గర లేదు. మేము భూములు ఆక్రమించుకుని ఎక్కడా అమ్ముకోలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..ప్రజలకు నచ్చిన నాయకునికి టికెట్ ఇవ్వాలని భావిస్తోంది.
ఆనాడు మహామహ ఉద్దండులు కరీంనగర్ నుంచి ఉన్నా..విద్యార్థి నాయకునిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు ఎంపీగా టికెట్ ఇస్తే గెలిపించారు. పొన్నంపై నిలబడిన అతీరథ మహారథులు ప్రజలు బండకేసి కొట్టి ఓడించారు. గెలిచిన పొన్నం మీ ఆశలను వమ్ము చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసారు. సుష్మా స్వరాజ్ కాళ్లకు దండకు పెట్టి తెలంగాణకు సపోర్టు చేయమని పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు. మధుయాష్కీ, పొన్నం పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ ఎవరి కాళ్లు మొక్కాడు.
2021లో కూడా ఇప్పుడు అదే సంప్రదాయంతో మళ్లీ బల్మూరి వెంకట్ ను పోటీ చేయిస్తున్నాం. హుజురాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ దొంగలు ఎక్కడ చూసినా దోపిడికి పాల్పడుతున్నారు. దోచుకున్న సొమ్ముతో ఇక్కడ కొనుగోళ్లు చేస్తున్నారు. పొద్దునొకడు, సాయంత్రం ఒకడు లీడర్లను కొంటున్నారు. కొన్నోడినే మళ్లీ మళ్లీ కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఓ కసబ్ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరాడు. పాకిస్థాన్ నుంచి వచ్చిన కసబ్ లాగా.. కాంగ్రెస్ నమ్మి టికెట్ ఇస్తే..కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడుపోయాడు.
ఈ రోజు నుంచి వాడిని ఒరే కసబ్ అని పిలువండి. ఆ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కొడుకులాగా నమ్మి బెడ్ రూంలో పెట్టుకుంటే..ఆయననే మోసం చేసాడు. పదవి ఆశ చూపితే పోయినోడికి..పదవి రాకుండా గవర్నర్ ఆపేసారు. మోడీకి, కేడీకి బుద్ధి చెప్పాలంటే బల్మూరి వెంకట్ ను గెలిపించాలి. కేసీఆర్ లాంటి నయవంచకుని మెడలు వంచాలంటే వెంకట్ ను గెలిపించాలి. హుజురాబాద్ లో విద్యార్థులు, యువకులు కలిపి 60 వేల మంది ఉన్నారు. మీ ఓటు మీరు వేసుకుంటే మీ ఎమ్మెల్యేగా వస్తాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.