వాహనదారులకు అలర్ట్- హైదరాబాద్ లో అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు

0
55

హైదరాబాద్‌ నగరంలోని అరాంఘర్‌ నుంచి పురానాపూల్‌ వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్‌పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అరాంఘర్‌ నుంచి బహదూర్‌పురా మీదుగా పురానాపూల్‌ మార్గంలో రాకపోకలు సాగించే జిల్లా, సిటీ బస్సులు, ఇతర భారీ వాహనాలను అరాంఘర్‌ చౌరస్తా వద్ద దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ఆ వాహనాలు మైలార్‌దేవ్‌పల్లి, ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్స్‌, చాంద్రాయణగుట్ట, ఐఎస్‌ సదన్‌, సైదాబాద్‌, నల్లగొండ క్రాస్‌ రోడ్డు మార్గంలో వెళ్లాలని, నగరంలో నుంచి వచ్చే భారీ వాహనాలు కూడా నల్లగొండ క్రాస్‌ రోడ్డు మీదుగా అరాంఘర్‌ రూట్‌లో వెళ్లాలని సూచించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు యథావిధిగా అరాంఘర్‌ నుంచి పురానాపూల్‌కు రాకపోకలు సాగించవచ్చన్నారు.