ముందస్తు ఎన్నికలపై టిఆర్ఎస్ మంత్రి సంచలన కామెంట్స్

0
92

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు వట్టి భ్రమేనని రాష్ట్రంలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముందస్తూ అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని ఆ కలలు అన్ని పగటి కలలుగా ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు.

శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్వాంగుల మరియు వయో వృద్ధుల శాఖా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్క్యూటిలు, ట్రై సైకిల్లు, లాప్ టాప్ లతో పాటు 4జి ఫోన్ లను ఆయన అంద జేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివ్వాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనే వికలాంగులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు.

అందుకే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి 1500 రూపాయల ఫించన్ అందించారన్నారు. రెండో మారు అధికారంలోకి రాగానే వారి ఫించన్ ను 3000 లకు పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దివ్యాంగులు అడగకపోయినా వారి జీవితాల్లో వెలుగులు నింపే పద్దతిలో వారికి ఆసరాగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. అంగ వైకాల్యతను అధిగమించి మిగితా వారితో పోటీగా అన్ని రంగాలలో వారిని పోటీ పడేలా మానసికంగా సిద్ధపరచడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. అటువంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఉందా అని ఆయన కాంగ్రెస్, బిజెపి లను సూటిగా ప్రశ్నించారు. ప్రధానికి ముందు ఏకధాటిగా 25 ఏండ్లు బిజెపి ఎలుబడిలో ఉన్న గుజరాత్ లో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలులో లేవన్నారు. మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు. అభివృద్ధి జరుగదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటూ జరిగితే ఒకరిద్దరు దళారులకు మాత్రమే ఆ ఫలితం దక్కిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కు బిజెపి 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. అది అందుకోవడం ముమ్మాటికీ గగనకుసుమమేనన్నారు.25 ఏండ్ల పాలనలో గుజరాత్ లో ఇంటింటికి మంచినీరు అందించలేని వారు ఇక దేశాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ఆయన నిలదీశారు. మోడీ పాలనలో అభివృద్ధి జరగదు. సంక్షేమం ఉండదు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కరలేదు అని ఆయన చెప్పారు. అభివృద్ధి మీద చర్చ కు బిజెపి సిద్ధం అనుకుంటే అది ఢిల్లీ అయినా,గాంధీ నగర కైనా తమ పార్టీ కార్యకర్తలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ,రైతుభీమా, రైతుబంధు వంటి పథకాలు దేశంలోని కాంగ్రెస్ , బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఉంటే చెప్పాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి బిజెపి/కాంగ్రెస్ లకు సవాల్ విసిరారు. రైతు బంధు పేరుతో 14 నుండి 15 వేల కోట్ల రూపాయలు రైతాంగానికి పెట్టుబడుల రూపంలో అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని ఆయన విపక్షాలకు సవాల్ విసిరారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ సాలీనా 3000 కోట్ల ప్రీమియం తో యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా సహజ మరణాలకు కుడా భీమా వర్తించేలా రైతుభీమా పెట్టింది నిజం కాదా అని ఆయన ప్రతిపక్షాలను నిలదీశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా ను కరువు పీడిత ప్రాంతంగా మార్చిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ దేనని,అంతే గాకుండా రెండు లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడేందుకు కారణం కుడా ఆ పార్టీదేనన్నారు. అటువంటి పాపాలనుమూట కట్టుకున్న కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే జిల్లా ప్రజలు పాతర పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాలలో జెండా ఎగరేసేది టిఆర్ఎస్ అని అన్నారు. సీఎం కేసీఆర్ పై జిల్లా ప్రజలకు పెరిగిన విశ్వసనీయతకు నాగార్జున సాగర్, హుజుర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.