రేవంత్ రెడ్డికి తోక లేదు.. మూతి లేదు : దానం సీిరియస్

0
109

టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతాడు అంటూ మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. రేవంత్ రెడ్డితో ఆయన టచ్ లో ఉన్నారని, టిఆర్ఎస్ ను వీడతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దానం నాగేందర్ పార్టీ నేతలు ఎం .శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చదవండి…

తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది. కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారు. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదు. వాని (రేవంత్ రెడ్డి) అబ్బ సొత్తు అసలే కాదు. మూతి లేదు తోక లేదు అన్నట్టు ఉంది రేవంత్ తీరు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉంది రేవంత్ తీరు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నారు నెహ్రూ. అదే స్ఫూర్తి తో సీఎం కెసిఆర్ పని చేస్తున్నారు. కాళేశ్వరం ఆధునిక దేవాలయం. ప్రాజెక్టులపై ప్రతి పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి అదే పనిగా విమర్శలు చేస్తున్నాయి. అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు.

హైదరాబాద్ లో మేము మంత్రి గా ఉండి చేయలేని అభివృద్ధి ఇపుడు జరుగుతోంది. దళిత సాధికారిత కింద సీఎం తెస్తున్న పథకం గొప్పది. సోషల్ మీడియా కు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారి పై సైబర్ క్రైమ్స్ విభాగానికి పిర్యాదు చేశాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకు టీ ఆర్ ఎస్ తోనే ఉంటా. విధేయత తో కెసిఆర్ ,కే టీ ఆర్ ల నాయకత్వం కిందే పని చేస్తా. టిఆర్ఎస్ పార్టీ యే చిరకాలం తెలంగాణ లో ఉంటుంది. నా ఇంటికి ఎవడు వచ్చినా టీ ఆర్ ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే. కాంగ్రెస్, బీజేపీ లకు తెలంగాణ లో భవిష్యత్ లేదు. టీఆర్ఎస్ లో చిచ్చు పెట్టాలని చూసే వారికి పుట్టగతులు ఉండవు.

రేవంత్ కింద ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్లు ఆలోచించుకోవాలి. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వాడు ఎలా పనిచేస్తాడో అందరికి తెలుసు. సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందన్నారు. అలాంటి వారి అంచనాలను సీఎం కెసిఆర్ తలకిందులు చేశారు. సీఎం కెసిఆర్ అపర భగీరథుడు ,తెలంగాణ ప్రజల దైవం. అభివృద్ధి తెలంగాణ లో నిత్య కృత్యం. ఉమ్మడి ఏపీ లో అభివృద్ధి జరగనందుకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ఆత్మ పరిశీలనతో టీ ఆర్ ఎస్ లో చేరాం. కెసిఆర్ మేధో మధనం తో తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు హ్యాట్సాఫ్.

కాంగ్రెస్ నేతలు బంగారు తెలంగాణ లో భాగస్వామ్యం అయ్యేందుకు టీ ఆర్ ఎస్ లో చేరాలి. ఇదే మా ఆహ్వానం. కాంగ్రెస్ లో ఎవరైనా చేరడానికి అక్కడ ఏముంది ? కాంగ్రెస్ లో నాకు అవమానాలు చాలా జరిగాయి. కాంగ్రెస్ కంటే నాకు టీ ఆర్ ఎస్ లో వందింతలు ఎక్కువ గౌరవం దొరుకుతున్నది. నేను మంత్రి పదవి అడగలేదు. అడగను కూడా.. అని కామెంట్స్ చేశారు.