తెలంగాణ: హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయంగా వేడి పెంచుతోంది. నేతల ఆరోపణలు, విమర్శలతో రసవత్తర రాజకీయం సాగుతోంది. వలసల పరంపర మొదలు కానుందని సంకేతాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన 12 మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని అంటున్నారు హస్తం నేతలు. ఇక, టీఆర్ఎస్ నుంచే తమ పార్టీలోకి వలసలు మొదలు కానున్నాయని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హుజురాబాద్ ఉపఎన్నిక ముగియగానే కేసీఆర్‌కు షాక్ తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, హుజురాబాద్‌లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని షబ్బీర్ అలీ అన్నారు.
మరోవైపు షబ్బీర్ అలీ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి గోడ దూకేందుకు నిజంగానే ఎమ్మెల్యేలు సిద్ధమైయ్యారా? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని ఆ ఎమ్మెల్యేలు కోల్పోయారా? లేక టికెట్లు తమకు దక్కవు అనే అనుమానంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. షబ్బీర్ అలీ చెప్పిన ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు? అన్న చర్చ విసృత్తంగా సాగుతోంది.