ఈటల బర్తరప్ : హుజూరాబాద్ లో బిజెపికి అప్పుడే షాక్

huzurabad bjp leaders huzurabad trs operation akarsh

0
103

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకవైపు బిజెపిలో చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నవేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాక్ లు తగులుతున్నాయి.  తాజాగా పలువురు బిజెపి నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

నిన్నటి వరకు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఇనుగాల పెద్దిరెడ్డి ఈటలను ఎలా బిజెపిలో చేర్చుకుంటారని ప్రశ్నించి కలకలం రేపారు. భూఆక్రణమల ఆరోపణలతో బర్తరఫ్ చేసిన నేతలను బిజెపిలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నరని పార్టీ పెద్ద నేతలను ఆయన నిలదీయడం సంచలనం రేపింది.

ఇప్పుడు హుజూరాబాద్ పట్టణంలోని బిజెపి 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ, 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల బిజెపికి గుడ్ బై చెప్పి కారెక్కేశారు. హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక, టిఆర్ఎస్ నేత బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

అలాగే సింగిల్ విండో ఛైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్లు దండ భాస్కర్ రెడ్డి, ప్రతాప ఆంజనేయులు కూడా కారెక్కశారు. వీరికి మంత్రి గంగుల కమలాకర్ టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు బిజెపి నేతలు పి.శంతన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, కృష్ణ తదితరులు టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొలిపాక నిర్మల, రమ, రజిత, దొంతు రమేష్, నందమల్ల బాబు, రియాజ్, సాయి తదితరులు ఉన్నారు.

ఈటల టార్గెట్ గా టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపింది. హుజూరాబాద్ లో మాత్రం టిఆర్ఎస్ వర్గం, ఈటల వర్గంగా రెండుగా ఆ పార్టీ చీలిపోయింది. ఈటల వర్గంలో ఉన్నవారిని సామదాన బేద దండోపాయాలతో టిఆర్ఎస్ గూటికి రప్పించుకుంటూనే… మరోవైపు బిజెపిలో ఉన్నవారికి కూడా ఆకర్ష్ వల విసురుతున్నారు. ఇప్పటికే కొందరు వలలో చిక్కగా వారికి గులాబీ కండువా కప్పారు. ఇక ఈటల వర్గంలో మిగిలిన వారిని, బిజెపిలో ఉన్న అడుగుబొడుగు లీడర్లను కూడా గులాబీ గూటికి చేర్చే ప్రయత్నంలో పార్టీ నేతలు నిమగ్నమైనారు.

ఈటల రాజేందర్ బిజెపి నేతలతో మంతనాలు జరిపి బిజెపి తీర్థం పుచ్చుకోవడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగిపోయే లోగా ఆయన శిబిరంలో ఒక్కరిని కూడా లేకుండా చేయాలన్న సంకల్పంతో టిఆర్ఎస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ఇద్దరూ ఇక్కడ ఫోకస్ చేసి ఈటలను బలహీనం చేసే దిశగా, టిఆర్ఎస్ ను స్ట్రాంగ్ చేసే దిశగా సాగుతున్నారు.