ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత సైతం కోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు సునీత. ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడంలేదంటూనే కొందరిపై అనుమానాలున్నాయని ఓ జాబితాను హైకోర్టుకు సమర్పించారు.
ఆ జాబితాలో వైసీపీ ఎంపీ అవినాష్‌తో పాటు టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి పేర్లు ఉండటం చర్చనీయాంశమైంది. హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత జగన్, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో ఈ వ్యాజ్యాలన్నీ మిగతా వాటితో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు కేసు విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు వేసిన వారిలో ప్రస్తుతం సీఎం జగన్ కూడా ఉన్నారని.. అలాంటప్పుడు కేసు సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించింది. ఐతే దీనిపై సమాధానం చెప్పేందుకు అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఐతే సిట్ విచారణ తుది దశలో ఉన్నందున.. సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని గతంలోనే ఏజీ హైకోర్టుకు తెలిపారు.