లఖింపూర్ ఖేరి కేసు: కేంద్రమంత్రి కొడుకు అరెస్ట్

0
89

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు గత రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఈ నెల 3న లఖింపూర్ ఖేరిలో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపి తిరిగి వెళ్తున్న సమయంలో ఆశిష్ మిశ్రా కారు వెనక నుంచి వేగంగా వచ్చి రైతులను తొక్కించుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఆశిష్‌పై హత్య కేసు నమోదైంది. శుక్రవారం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆశిష్ గైర్హాజరయ్యారు. దీంతో శనివారం తప్పకుండా హాజరు కావాలని, లేకుంటే చర్యలు తప్పవని పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు.

దీంతో నిన్న ఆయన లఖింపూర్ ఖేరి పోలీస్ లైన్స్‌లో ఉన్న క్రైంబ్రాంచ్ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఆశిష్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాము అడిగిన ప్రశ్నలకు మిశ్రా సరైన సమాధానాలు ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని అధికారులు తెలిపారు. ఆశిష్‌ను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.