సీఎం కేసీఆర్ ప్రకటనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏమన్నారంటే?

0
97

రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ చెప్పబోతున్నారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు కేసీఆర్. తాను రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడడం శుభపరిణామం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని సీఎం ప్రకటిస్తాడేమోనని ప్రతిపక్ష నేతగా నేను ఆశిస్తున్నాను. రాష్ట్రంలో అధికారికంగా ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపుగా 25 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. నిరుద్యోగ యువతీ, యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న దానిని ఒకేసారి విడుదల చేస్తారని ఆశిస్తున్నా.

సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగులు మరియు ప్రతిపక్ష నేతగా నేను కూడా ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి విడుదలకు సంబంధించిన అంశాలనే వెల్లడిస్తారని ఆశిస్తున్నాము. ఈ రెండు విషయాలను కచ్చితంగా కెసిఆర్ వెల్లడించాలని కోరుతున్నానని భట్టి విక్రమార్క తెలిపారు.