కేసీఆర్ ప్రెస్ మీట్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

What did TPCC Rewanth Reddy say about KCR press meet?

0
87

తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి ప్రెస్ మీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకోవాల్సిన అవసరం లేదని లేఖ ఎలా ఇస్తావు కేసీఆర్. నాడు లేఖ ఇచ్చి..నేడు పోరాటం అంటే రైతుల చెవుల్లో పూలు పెడదామనా? నాడు వ్యవసాయ చట్టాలకు జై కొట్టలేదా కేసీఆర్?
ఢిల్లీలో మోదీకి గులాంగిరీ చేశావు. రైతులు చలిలో చస్తుంటే కనీసం పరామర్శించావా? అంటూ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు పేనుతున్నారన్న విషయం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాల్సిందిగా కోరబోమని తానే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్టు కేసీఆర్ మీడియా ముఖంగా బహిరంగంగా ఒప్పుకున్నారు. తెలంగాణ రైతుల పక్షాన ఇంత ఘోరమైన నిర్ణయం, ఏకపక్షంగా తీసుకునే అధికారం కేసీఆర్ కు ఎవరిచ్చారు. రైతు సంఘాలు, రైతు నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రానికి లేఖ ఇవ్వడానికి కారణం ఏమిటి. నీ కేసుల విషయంలో నీకు మోదీ సహకారం కావాలి. దానికి ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరి వేసే ఈ లేఖను ఇచ్చావా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

బాయిల్డ్ రైస్ తీసుకోమని అడగబోం అని నీవే కేంద్రం ముందు మోకరిల్లి లేఖ ఇచ్చి వచ్చిన తర్వాత ఇక నువ్వే పోరాటం చేస్తానంటూ బీరాలు పలకడం తెలంగాణ రైతులను మోసం చేయడం కాదా. కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా రైతులు కొట్లాడుతుంటే..మోదీతో ములాఖత్ కు, నీ పార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు పదే పదే ఢిల్లీకి పోయిన నీకు వాళ్లను పరామర్శించాలన్న జ్ఞానం కలగలేదు. ఏడాదిగా చలిలో వణుకుతూ, ఎండలో ఎండుతూ కొందరు రైతులు ప్రాణాలు కోల్పోతే ఇదేం ఘోరం అని కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం నీకు లేదు. పదే పదే ఢిల్లీ పై యుద్ధమే అని ఎన్ని సార్లు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తావు.

ప్రగతి భవన్ లో మీరు ప్రెస్ మీట్ పెడితే…రైతుల సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశించాం. తెలంగాణలో 6,500 కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి ఇప్పటికీ 2,500 కు మించి కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. వాటి విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారేమోనని ఆశించాం. కామారెడ్డి జిల్లాల్లో రైతు బీరయ్య పది రోజుల పాటు కొనుగోలు కేంద్రంలో వరి కుప్పపై పడిగాపులు పడి గుండె పగిలి చనిపోతే ఆ కుటుంబాన్ని ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, కనీసం జిల్లా కలెక్టర్ కానీ పరామర్శించలేదు. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని చెబుతారేమో అని ఆశించాం. పంట కోతలకు సైతం టోకెన్లు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపుతారేమోనని ఆశించాం. ధాన్యం సేకరణ పై స్పష్టమైన విధివిధానాలు ప్రకటిస్తారేమోనని ఎదురు చూశాం. సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేస్తారేమోనని కోరుకున్నాం. కానీ, ఇవేవీ చేయకుండా కేంద్రంతో కయ్యం అంటూ మీరు మళ్లీ పాతపాటే పాడారు. నా వల్ల ఏమీ కాదు… అని మీరు చేతులెత్తేసినట్టు స్పష్టంగా అర్థమైంది.

మొత్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నేనేమీ చేయలేను. కేంద్రం కొంటే మధ్యలో దళారీ పాత్ర పోషిస్తాను తప్ప కేంద్రంతో కొనిచ్చే బాధ్యత నాది కాదు అని మీరు చేతులెత్తేశారు. ఢిల్లీ కొననంటోంది నన్నేం చేయమంటారని చావు కబురు చల్లగా చెప్పారు. ఢిల్లీ కొననంటే దానికి డూడూ బసవన్న లాగా మీరెందుకు అనుమతిస్తూ లేఖ ఇచ్చి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిసే డ్రామాలు ఆడుతూ మధ్యలో రైతును బలిపశువును చేస్తున్నారన్న విషయం ఇప్పటికే రైతాంగానికి అర్థమైపోయింది. చనిపోయిన రైతు బీరయ్య గురించి మాట్లాడలేదు. మిగతా 4000 కొనుగోలు కేంద్రాలు ఎప్పటి లోగా తెరుస్తారో చెప్పలేదు. మీ వ్యవసాయ విధానం ఏమిటో చెప్పలేదు. రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పలేదు. మద్యం షాపుల లైసెన్సుల రెన్యూవల్ పై మీద ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మీకు ఎందుకు లేదో అర్థం కావడం లేదు. మీ ఉన్మాద చర్యలు ఏమిటో తెలంగాణ సమాజానికి అర్థం కావడం లేదు. ఇద్దరు తోడు దొంగలే అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

వరి పంట వేయొద్దు అనోటోడివి లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు. ఆరు తడి పంటలే వేయాలన్నప్పుడు అంత సాగునీరు కూడా అవసరం లేదు కదా. కట్టిన ప్రాజెక్టుల లక్ష్యం ఏమిటి. వాటి ప్రయోజనం ఏమిటి. ఎవడబ్బ సొమ్మును మీరు వృధా చేస్తున్నారు. వరి వద్దన్నప్పుడు 24 గంటల విద్యుత్ దేనికి, ఆరు తడి పంటలు పండిస్తే 24 గంటలకు విద్యుత్ ఎవరికి అవసరం ఉంటుంది.
వరి వద్దు అన్నప్పుడు వేరే ఏం పంటలు వేయాలో మీ దగ్గర ప్రణాళిక లేదు. ఆ పంటలు వేస్తే మార్కెట్ పరిస్థితి ఏమిటో అంచనా లేదు. కొనే నాథుడు ఉంటాడో లేడో తెలియదు. వాటికి గిట్టుబాటు ధర పరిస్థితి ఏమిటో తెలియదు. మొత్తంగా రైతుల పంట కొనుగోళ్లు బాధ్యత నుంచి మెల్లగా తప్పించుకునే కార్యక్రమానికి ఇద్దరు కలిసి శ్రీకారం చుట్టారన్న విషయం అర్థమవుతోంది. ఏడాది క్రితం వ్యవసాయ చట్టాలకు మద్ధతిచ్చి, రైతును కార్పొరేటోని చేతుల్లో పెట్టిన పాపంలో కేసీఆర్ కు కూడా భాగస్వామ్యం ఉంది కదా.

హంతకుడే బాధితుడి అవతారం ఎత్తి డ్రామాలాడుతున్నట్టు కేసీఆర్ తీరు ఉంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి పంట అమ్మడానికి సంగతి దేవుడెరుగు..కోతకు సైతం టోకెన్లు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కల్పించిన దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ ది. కొనడానికి టోకెన్లు సరే, కోత కోయడానికి కూడా టోకెన్లా. నీందే రైతు ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించే రైతులు గోస వెళ్లబోసుకున్నారు.
మీ ప్రభుత్వం వారి కష్టాలు తీర్చడానికి కనీసం కలెక్టర్లను పంపలేదు. చనిపోయిన వారిని పరామర్శించలేదు. నాడు రైతు చట్టాలకు మద్ధతు పలికి, నీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆదేశించింది వాస్తవం కాదా.

ఢిల్లీ రైతులను ఏడాదిగా చలిలో వణికిపోతుంటే..అమిత్ షా, మోదీ వద్దకు వెళ్లి అలాయ్ బలాయ్ చేసుకున్నావు కానీ కనీసం ఆ దీక్షలు చేస్తోన్న రైతుల పరామర్శకు వెళ్లలేదు. పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రం ఒక్క రూపాయి పెంచలేదని మీరు చెప్పడం పచ్చి అబద్ధం. ఒక దఫా రెండు రూపాయలు, మరో దఫా రెండు రూపాయలు పెంచావు. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట రూ.10 తగ్గించారు. నీ సంగతేంటో చెప్పు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు నా పార్టీ గొప్పది కర్ణాటకోడు తెలంగాణలో కలుస్తానంటున్నాడు. మహారాష్ట్రోడు కలుస్తానంటున్నాడు అని ఇంకా ఎన్నాళ్లు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తావు. నిన్ను బంగాళాఖాతంలో కలిపితే తప్ప తమ సమస్యలు పరిష్కారం కావని రైతులు భావిస్తున్నారు. వాళ్ల పక్షాన నిలబడి అటు కేంద్రం, ఇటు నీ సంగతి ప్రజాకోర్టులో తేల్చే విధంగా కాంగ్రెస్ కార్యచరణలో వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.