తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యంను, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. కానీ రాష్ట్రంలో వీరిద్దరూ చేస్తున్న ధర్నాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా ఈ క్రమంలో ప్రజలు రైతులు ఆశ్చర్య పోతున్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతాంగంకు పెద్దపీట వేస్తున్నామని, రైతుబంధు రైతు బీమా పథకాలు తీసుకువచ్చి, రైతులను లాభసాటిగా మారుస్తామని, ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల మాగాణి చేస్తున్నామని చెప్పారు. జలసిరులు వట్టిపడుతున్న సమయంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిపోవడం ఐకెపి పిఏసిఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కానీ వచ్చే యాసంగి సీజన్ నుండి ధాన్యం కొనుగోలు జరపమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. వరి వేస్తే ఉరే అంటుంది. ప్రతిపక్షాల మాటలకు, రైతులకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, ఎఫ్సీఐ అధికారికంగా లెటర్ వ్రాసినారని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇక్కడ ఎవరు రైతు పక్షం వహిస్తున్నారు. తెలియడం లేదు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న ఇప్పటివరకు మార్గదర్శకాలు లేవు భూసార పరీక్షల విధానం లేదు.
స్వరాష్ట్రంలో సమస్యలు ఉండవని చెప్పి ధర్నా చౌక్ రద్దు చేసిన ప్రభుత్వం అదే ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఖమ్మం జిల్లాలో మద్దతు ధరను అడిగిన రైతులకు బేడీలు వేసి జైలుపాలు చేసింది.
కనీసం స్వరాష్ట్రంలో నైనా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు కావడం లేదు. ఎరువులు విత్తనాలు క్రిమిసంహారకాలు ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్టుబడి వ్యయం కంటే తక్కువ ఆదాయంలో రైతు తన జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాటినుండి పూర్తిగా తప్పుకుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. రైతుల పట్ల ఈ రకంగా వ్యవరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి విషయంలో ధర్నాలు చేయడమేమిటని ప్రశ్న తలెత్తుతుంది.
గత సంవత్సర కాలంగా ఢిల్లీ నడివీధుల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు రైతాంగ ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం జరుగుతుంటే, దాని పరిష్కారానికి చొరవ చూపడం లేదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడం, కోసం మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతును బానిసగా మార్చే విధానముకు పూనుకుంది. పైగా కార్లతో తొక్కించి, చంపేయడం అలాగే అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదంతా పాలకుల ముందు జరుగుతున్న పరిణామ క్రమము అయినా రైతుల పక్షాన నిలబడటం లేదు. సమస్యలు పరిష్కరించి అమలు పరచాల్సిన పాలకులు ధర్నాలు చేయడం వల్ల ఉపయోగమేమిటని ఆలోచించాలి.
రైతులకు రుణమాఫీ గిట్టుబాటు ధరలు సబ్సిడీ విత్తనాలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రభుత్వాలు రైతుల కోసం ఉద్యమం చేయడం వెనక మతలబేమిటో, ప్రజలు గమనించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా రైతుల కోసం ఏమైనా చేయదలుచుకుంటే వారి సంక్షేమం కోసం చట్టం ప్రకారం మీరు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగండి. ప్రజా సమస్యలపై దృష్టి సారించండి. ఆదుకోండి. అధికార పార్టీలుగా రైతులకు తోడుగా నిలవండి.
సేకరణ: గద్దల మహేందర్