గౌరవనీయులైన నరేంద్రమోడీ గారికి,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు.
సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోదుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నది.
ఎఫ్ సిఐ అవలంబిస్తున్న అయోమయ విధానాలు ఏమిటంటే :
1. ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదు.
2. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు.
పైన తెల్పిన ఎఫ్ సిఐ అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారింది.
ఉదాహరణకు..2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయింది. కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్ సి ఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది.
ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయల్ ని సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో నేనే స్వయంగా వెల్లి కలిసాను. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్దారించాలని నేను విజ్జప్తి చేశాను. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో..ఎఫ్ సిఐకి ఈ కింది ఆదేశాలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.
1. 2020- 21 ఎండాకాలం సీజన్లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలి.
2. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, పంజాబ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణలో కూడా ఈ 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలి.
3. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరి ధాన్యం కొంటుందో ముందుగానే నిర్దారించాలి.
◆ ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను తమరికి విజ్జప్తి చేస్తున్నాను.
అభినందనలతో..
భవదీయుడు
కె.చంద్రశేఖర్ రావు