ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారెటు? : రెండు ఆప్షన్లు

0
121

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఒక డైనమిక్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్. పేదల పట్ల తపన ఉన్న నాయకుడు. అణగారిన వర్గాల కోసం అనునిత్యం తపించిన ఉన్నతుడు. తరతరాల అణిచివేతకు గురవుతున్న వారి పక్షాన పోరాడిన వీరయోధుడు. ఇప్పుడాయనది కొత్త మజిలీ. జీవన యాత్రలో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన బతుకేమీ పూల పాన్పు కాదు. ప్రయణమంతా ముళ్ల బాటలోనే కాబట్టి ఆయన భవిష్యత్తులో వేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

గద్వాల జిల్లా అలంపూర్ లో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత చదువులు చదువుకున్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో చదివారు. ఐపిఎస్ అయ్యారు. తెలంగాణలో గత 9 ఏళ్లుగా గురుకులాలకు కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 26 ఏండ్ల పాటు ఐపిఎస్ గా సేవలందించిన ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉత్తగ ఉండే రకం కాదని అందరికీ తెలుసు. మరి ఆయన అంత పెద్ద పదవికే రాజీనామా చేశారంటే ఇంకేం చేయబోతున్నారో అని అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న. ఆయన ముందున్న ఆప్షన్లు ఏమిటి? ఆయన దారెటు వైపు అన్నది… ఆయన సన్నిహితులతో మాట్లాడినప్పుడు వచ్చిన అభిప్రాయాలను మనం ఇప్పుడు చూద్దాం.

మొదటి ఆప్షన్ :

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సడెన్ గా విఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం చూస్తే.. ఆయన రాజీనామా చేసి వెంటనే టిఆర్ఎస్ లో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయవచ్చు అనేది ఒక చర్చ ఇప్పటికే షురూ అయింది. హుజూరాబాద్ లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న టిఆర్ఎస్ దళిత ఓటు బ్యాంకు మీద కేంద్రీకరణ పెంచిన విషయం తెలిసిందే. దళిత బంధు అనే పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఐపిఎస్ అధికారి అయిన ప్రవీణ్ ను కూడా రంగంలోకి దింపుతుందా? అన్న ప్రచారం ఊపందుకున్నది. కానీ దీనిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

రెండో ఆప్షన్ :

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించే అవకాశం. గత కొంతకాలంగా ఆయన స్వేరో సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. లక్షలాది మంది స్వేరో సైన్యంలో ఉన్నారు. చదువుకున్నవారు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా స్వేరోలుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వేరో సంస్థలో పనిచేస్తున్న సైన్యాన్ని సమీకరించి కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. ఆయన రాజకీయ పార్టీ నెలకొల్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యావత్ దళిత సంఘాలన్నీ ఆ పార్టీలో చేరిపోయే అవకాశం ఉండొచ్చు. అయితే ప్రవీణ్ కుమార్ సన్నిహితులు ఈ అంశాన్ని కొట్టిపారేయడంలేదు. సో ఇది జరిగే చాన్స్ ఉంది.

పార్టీ అంటే అంత ఈజీనా?

రాజకీయ పార్టీ అంటే అంత ఈజీ కాదని ఇటీవల జరిగిన అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద విజయశాంతి పార్టీ, టైగర్ నరేంద్ర పార్టీ, జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ, కోదండరాం తెలంగాణ జన సమితి, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ లాంటివన్నీ నిలబడలేకపోయాయి. కోదండరాం పార్టీ, జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ తప్ప మిగిలినవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉమ్మడిరాష్ట్రంలో సీమాంధ్ర సినీనటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం కూడా జెండా ఎత్తేసింది. పార్టీ అంటే ఆర్థిక వనరులు పటిష్టంగా ఉండాలి. కుల మత రాజకీయాలు నడుస్తున్న ఈరోజుల్లో అంగబలం పెంచుకోవాలి. మరి కేవలం దళిత ఓటు బ్యాంకుతో పార్టీ మనుగడ సాధించలేదు. మిగతా కులాల ఓటు బ్యాంకును ఎలా రాబట్టుకుంటారన్నది తేలాలి. ఎవరెన్ని చెప్పినా కుల వ్యవస్థ బలంగా ఉన్నది కాబట్టి మిగిలిన సెక్షన్లను ఆకర్షించే మార్గమేది?

ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మరి ప్రవీణ్ కుమార్ పార్టీ రూపంలో రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బ తిని టిఆర్ఎస్ కు మేలు కావొచ్చన్న ప్రచారం అప్పుడే మొదలైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ లో చేరినా, సొంతంగా పార్టీ పెట్టినా అంతిమంగా టిఆర్ఎస్ కు మేలు చేకూర్చే పనే అన్న వాదన కూడా తెరముందుకు వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే రీతిలో వైఎస్ షర్మిల చేత పార్టీ పెట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ కూడా పార్టీ పెడతారా అన్న అనుమానాలు కలుగున్నాయి.

పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరాం చూపిన బాటలో నడుస్తానని ప్రవీణ్ కుమార్ రాసిన లేఖలో వెల్లడించారు. దీన్నిబట్టి ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి రావడం అనివార్యమైపోయిందని అంటున్నారు. ఉద్యోగ జీవితంలో అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రవీణ్ కుమార్ కొత్త ప్రయాణంలో మరెన్ని సంచనాలు సృష్టిస్తారో చూడాలి.

ఆయన విడుదల చేసిన లేఖ కింద ఉంది.