వారిద్దరి బాటలో ఉత్తమ్ నడుస్తారా ? కాంగ్రెస్ లో టెన్షన్

0
152

కాంగ్రెస్ కు మాజీ పీసీసీ చీఫ్ లతో ముప్పు తప్పడం లేదా? చీఫ్ పోస్టులు చేపట్టిన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారా? అందరూ అనలేం కానీ… కొందరి విషయంలో ఇదే జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ లు గా పని చేసిన కే కేశవరావు, డి శ్రీనివాస్ లు ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆ క్రమంలో ఇప్పుడు మరో మాజీ పీసీసీ చీఫ్ కూడా ప్రయాణిస్తారా అన్న డౌట్ వస్తోంది.

ఇప్పుడు అన్నీ వేళ్లూ తాజా మాజీ పీసీసీ చీఫ్ వైపు చూపిస్తున్నాయి. ఉత్తమ్ పార్టీలో ఉంటాడా లేక కారెక్కుతాడా అన్న డౌట్ టీ కాంగ్రెస్ లో చక్కర్లు కొడుతోంది. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఉత్తమ్ విషయంలో నిప్పు లేదని చెప్పలేం. ఎందుకంటే తాజాగా ఆయన తమ్ముడు కౌశిక్ రెడ్డి కారెక్కేయబోతున్నారు. కౌశిక్ ఉత్తమ్ మాట జవదాటడు అని చెబుతుంటారు. ఉత్తమ్ డైరెక్షన్ లేకుండా ఆయన ఏమీ చేయడని అంటారు.

ఈ నేపథ్యంలో కౌశిక్ టీఆర్ఎస్ లో చేరడంతో నెక్ట్స్ ఉత్తమ్ కూడా ఆ బాటే పడతారా అన్న డౌట్ రేజ్ అవుతోంది. వాస్తవానికి ఉత్తమ్ తనికి తాను కాంగ్రెస్ లాయలిస్ట్ గా చెప్పుకుంటారు. సోనియా, రాహుల్ కు బాగా దగ్గరవాడు అన్న టాక్ కూడా ఉంది. కానీ, ఫీల్డ్ లో మాత్రం సీన్ భిన్నంగా కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న సామెత ఉత్తగనే పుట్టుకు రాలేదు కదా అని కాంగ్రెస్ పెద్ద లీడర్లు సైతం గుసగుసలాడుతున్నారు.

కౌషిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఉత్తమ్

మరోవైపు పాడి కౌషిక్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడని గుర్తు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు అని తెలిపారు. కాంగ్రెస్ నాయకులపై పీసీసీ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మాటలు టిఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలే అన్నారు. ఇప్పటికే కౌషిక్ ను పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎవరైనా నాయకులు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలని చురకలు వేశారు. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. టిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు.