ఏడాది పాటు మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 700 మందిని ప్రాణత్యాగాలు చేసి సాగించిన రైతాంగ ఉద్యమం ప్రభావం తాజాగా జరిగిన ఎన్నికలపైలేదని కొందరు వాదిస్తున్నారు.
ప్రజా ఉద్యమాల ప్రభావం ఎన్నికలపై ఎంతో కొంత ఉంటుంది. తాజా ఎన్నికల ఫలితాలే దానికి ప్రబల నిదర్శనం.
మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ప్రభావం ఎన్నికలపై పడింది. ఆ ఉద్యమంలో “మిలిటెంట్” పాత్ర పోషించిన పంజాబ్ లో బిజెపి ఘోర ఓటమిని చవిచూసింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని చెరకు రైతులు మరియు జాట్లు అత్యధికంగా ఉన్న ముజఫర్ నగర్, శామ్లీ, భాగపాట్, మీరట్ జిల్లాలలోనే రైతు ఉద్యమం కేంద్రీకృతమైంది. ఆ నాలుగు జిల్లాలలో 19 శాసనసభ స్థానాలుంటే ఆరింటిలో మాత్రమే బిజెపి గెలిచింది. వాటిలో కూడా మూడు పశ్చిమ మీరట్, మీరట్ కంటోన్మెంట్, ముజఫర్ నగర్, అంటే, పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో గెలిగింది. సహజంగానే పట్టణ ప్రాంతాల్లో సాగు చట్టాల ఉద్యమ ప్రభావం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ ప్రాంతంలో 2013 నాటి మత ఘర్షణల దుష్ప్రభావం ఉండనే ఉంది.
ప్రజలు ఏం చూసి సమాజ్ వాదీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి? ఆ పార్టీ, దాని నాయకుడు అఖిలేష్ యాదవ్ ఐదేళ్లు పాటు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించకుండా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారు. రైతాంగ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవలేదు. కనీసం పాల్గొనలేదు. అధికార దాహంతో మాత్రమే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా నేనున్నానంటూ కుల సమీకరణాలపైన, ప్రభుత్వ వ్యతిరేకతపైన ఆధారపడి, అహంభావంతో వ్యవహరిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది కాబట్టే బిజెపికి గణనీయంగా సీట్లు తగ్గాయి. ఆ మేరకు సమాజ్ వాదీ పార్టీకి సీట్లు పెరిగాయి. అంతేకానీ, సమాజ్ వాదీ పార్టీకి పడిన సానుకూల ఓట్లవల్లకాదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలతోలేని పార్టీలకు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి?
టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు