ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా అక్కడ రాజకీయ వ్యూహకర్తల మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎన్నికల్లో ఈ వ్యూహకర్తలని నియమించుకుని ముందుకు సాగుతున్నాయి. ప్రజల్లో ఎలా మాట్లాడాలి, సోషల్ మీడియాలో ప్రచారాలు, స్పీచ్ లు, ప్రజలకు మరింత దగ్గరవ్వడం ఎలా, మేనిఫెస్టో ఇలా ప్రతీ విషయంలో ఈ ఎక్స్ పర్ట్స్ ఇచ్చే సలహాలు రాజకీయ పార్టీలకు చాలా ఉపయుక్తంగా మారుతున్నాయి.
అందుకే చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్తలని నియమించుకుంటున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఎక్కడ ఈ బాధ్యతలు తీసుకున్నా అక్కడ ఆ పార్టీలు విజయం సాధిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఇప్పుడు తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారు.
తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల షర్మిలతో ప్రియ సమావేశమయ్యారు. ప్రియకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవముంది. ఇక ఈ విషయం పై త్వరలో ప్రకటన రానుంది అని తెలుస్తోంది.