రెండు రోజుల్లో టిపిిసిసి చీఫ్ ఎంపిక : రేస్ లో ఆ ఇద్దరే

0
139

ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న తెలంగాణ పిిసిసి అధ్యక్ష పదవిని అధిష్టానం మరో రెండు లేదా మూడు రోజుల్లో అనౌన్స్ చేయడం ఖాయమైంది. కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు కొత్త పిసిసి చీఫ్ ఎంపిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎంపిక కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈమేరకు అధిష్టానం నుంచి రాష్ట్ర పార్టీ నేతకు సంకేతాలు అందాయి.  కొత్త పిసిసి చీఫ్ రేస్ లో ఇద్దరు కీలక నేతలు మాత్రమే మిగిలారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి రేస్ లో ముందునుంచీ కీలకంగా ఉన్న వారు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వీరితోపాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ప్రయత్నాలు చేశారు. ఆయన పేరు గతంలో ప్రముఖంగా వినబడినా.. ఇప్పుడు తొలగిపోయింది. ఇక రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యనే ఉంది. ఇద్దరిలో కోమటిరెడ్డికే పిసిసి చీఫ్ దక్కొచ్చని ఆయన సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం గట్టి నమ్మకంతో ఉన్నారు.

నాగార్జున సాగర్ ఎన్నికల ముందు పిసిసి చీఫ్ పదవి ఎవరికి ఇస్తారో క్లారిటీ ఇఛ్చే ప్రయత్నం చేసింది అధిష్టానం. కానీ అక్కడ పోటీలో ఉన్న జానారెడ్డి పిసిసి చీఫ్ ఎంపికను సాగర్ బై ఎలక్షన్స్ ముగిసే వరకు ఆపాలని అధిష్టానాన్ని రిక్వెస్టు చేశారు. కొత్త సారథిని నియమిస్తే సాగర్ ఎన్నిక మీద ప్రభావం పడుతుందని కోరారు. అధిష్టానం ఆయన కోరికను మన్నించింది. కానీ ఆయన సాగర్ లో ఓటమిపాలయ్యారు.

అదే సమయంలో రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు ఇస్తారని అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. దానికి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. రేవంత్ ఒక టివి ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ.. తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటే చాలా ఇష్టమని దాన్ని ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. దీన్నిబట్టి అధిష్టానం ఈమేరకు సిగ్నల్స్ ఇచ్చాయన్న ప్రచారం సాగింది. కానీ సాగర్ ఎన్నిక కారణంగా ఎంపిక అప్పట్లో వాయిదా పడింది.

తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం సంస్థాగత అంశాలపై దృష్టి సారించింది. వివిధ రాష్ట్రాల్లో నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించి కార్యోన్ముఖులను చేసేందుకు సీనియర్లను రంగంలోకి దించింది. వచ్చే ఏడాది 2022లో ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా, గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే తెలంగాణ పిసిసి పైనా కసరత్తు పూర్తి చేసింది.

తెలంగాణ పిసిసి చీఫ్ పదవి కోసం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం తీసుకుంది. ఇక ప్రకటనే తరువాయిగా మిగిలింది. కోమటిరెడ్డికి పిసిసి ఇస్తే రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వొచ్చని టాక్ నడుస్తోంది. లేదంటే సమీకరణలు మారిపోతే రేవంత్ రెడ్డే కొత్త సారధి అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.

ఢిల్లీలో మొహరింపు :

పిసిసి రేస్ లో ఉన్న కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి సహా ఆశావహులంతా ఢిల్లీలో మొహరించారు. ఎవరికి ఉన్న పరిచాయలను వారు ఉపయోగించుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి అనుచరులు కూడా ఢిల్లీలో మకాం వేశారు.