తెలంగాణ రాష్ట్రంలో గత ఏడున్నర సంవత్సరాలుగా నిరుద్యోగం మూడింతలు పెరిగింది. దీనికి ఏవరు బాధ్యులు అని టీజేఏస్ అధినేత కోదండరాం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణ మర్చంట్ బిల్డింగ్ లో యువజన, విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో “నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సు” జరిగింది. ఈ సమావేశానికి యువజన, విద్యార్థి జన సమితిల జిల్లా అధ్యక్షులు భిక్షం నాయక్, వినయ్ లు అధ్యకత వహించారు. ఈ సమావేశానికి టీజేఏస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిరుద్యోగం 3% ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఏడున్నర ఏళ్ల కాలంలో మూడింతలు పెరిగి 8 శాతానికి పెరిగిందని కేంద్ర సంస్థల సర్వేలు చెపుతున్నాయి. దీనికి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత కాదా ? సీఏం తన అనుకూల మీడియా ద్వారా నిరుద్యోగం తగ్గిందని తప్పుడు వార్తలు రాయించుకుంటున్నారు. ఇది పూర్తి అవాస్తం. తెలంగాణలో ఇంతమంది నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే, నిరుద్యోగం తగ్గినట్టా ? పెరిగినట్టా ? ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలి. తెలంగాణలో ఇప్పటి వరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80 వేల లోపే ఉన్నవి. కానీ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేసామని అబద్దం చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఈ సంఖ్యపై దమ్ముంటే బహిరంగ చర్చకు నేను సిద్దం. దీనికి సీఏం కేసీఆర్ సిద్దమా? ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 21 మంది నిరుద్యోగులు చనిపోయారు. చదువుకున్న పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పీఆర్ఏసీ నివేదికలో బయటపడ్డ 1,91,000 ఉద్యోగాలు, ప్రభుత్వరంగ సంస్థలలో 50 వేలు, కొత్త జిల్లాల ద్వారా 10 వేల ఉద్యోగాలతో మొత్తం కలిపి 2 లక్షల 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసుకొనే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కరోనా వల్ల ప్రైవేట్ రంగంలో ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్లు, కార్మికులు, యువకులకు ప్రభుత్వం తరపున భరోసా కరువయ్యింది. ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం టీజేఏస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల తరపున పోరాటాన్ని ఉదృతం చేస్తాం.
ఈ సందర్భంగా నేను నిరుద్యోగులను వేడుకునేది ఏమంటే, ఆత్మహత్యలు చేసుకోకండి. పోరాడి మన ఉద్యోగాలు సాధించుకుందాం. టీజేఏస్ చేసే ఈ ఉద్యోగాల సాధన పోరాటంలో మాతో కలిసిరండి. డిసెంబరు 3వ తేదీన హైదరాబాదులో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి నిరుద్యోగులు, యువకులు భారీగా తరలిరావాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, టీజేఏస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాష, టీజేఏస్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు బాబూ మహాజన్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, టీజేఏస్ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ ముదిరాజ్, విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్, టీజేఏస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రమాశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మాంద్ర మల్లయ్య, హైదరాబాదు జిల్లా విద్యార్థి అధ్యక్షుడు నకిరేకంటి నరేందర్ .వినాయగౌడ్ భిక్షామ్నాయాక్, రఫీ, బంధన్ నాయక్, ఈశ్వర్ సతీష్, శివ, హారిఫ్, స్వయం గౌడ్ తదితరులు పాల్గొన్నారు .