రెడ్డి డాక్టర్లే పనికొస్తరా? : జగన్ కు ఎంపి రఘురామ మరో లేఖ

0
140

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు బహిరంగలేఖ రాశారు. ఇది ఆయన రాసిన 6వ లేఖ. ఈ లేఖలో వైద్యరంగంలో లోపాలను ఎంపీ ఎత్తిచూపారు. లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాం.

జులై 13, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విషయం: 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పై
సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 6
ముఖ్యమంత్రి గారూ,
అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగకపారు ఏరును, ద్విజుడున్
చొప్పడిన, యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

ఏది ఏమైనా కూడా, మనం అత్యధిక శాతం వడ్డీ ఇస్తామని చెబుతున్నా మనకు అప్పులు ఇచ్చేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం మంచి డాక్టర్లయినా ఇక్కడ ఉండేలా మనం నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నివశించేందుకు ప్రజలు ఇష్టపడే వీలైనా ఉంటుంది.

మే, జూన్ రెండు నెలల్లో, రాష్ట్రంలో 1,68,183 మరణాలు సంభవించాయి. ప్రభుత్వం నిర్వహించే జననమరణాల రిజిస్టర్ ను చూస్తే సగటున నెలకు 30,000 నుంచి 35,000 మంది మరణిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే జననమరణాల రిజిస్టర్ చూసినా, కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న రోజువారీ బులిటెన్లు పరిశీలించినా ఒక్క మే నెలలో 2938 మంది, జూన్ నెలలో 1776 మంది కరోనాతో మరణించినట్లుగా విశదమౌతున్నది.

ప్రభుత్వం ఎంతో అదుపుచేసి మరణాల లెక్కలు ప్రకటించినా కూడా దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో చాలా మరణాలను కరోనా కింద చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కరోనా మరణాలు కాకపోతే మరి ఈ మరణాలు ఇంత పెద్ద సంఖ్యలో ఎలా సంభవించాయనే విషయాన్ని మనం పరిశోధించి తేల్చాల్సి ఉంటుంది. సుమారు లక్ష మంది మరణించడానికి కరోనా కాకుండా వేరే కారణం ఏమైఉంటుందా అనే విషయానికి మనం సమాధానం వెతికిపట్టుకోవాల్సి ఉంటుంది. మరణాల సంఖ్య ఇంత దారుణంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్న ఈ స్థితిలో మనం, మన వైద్య ఆరోగ్య వ్యవస్థ సామర్ధ్యాన్ని, అందులో మౌలిక వసతులను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఈ మరణాలన్నీ కరోనా మరణాలు కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడానికి కారణాలు అన్వేషించి, అంతటి వైద్య వైపరిత్యాన్ని తక్షణమే నిలువరించాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది.

గత రెండు నెలలుగా ఇంత పెద్ద సంఖ్యలో జనం చనిపోవడానికి కరోనా కాకుండా వేరే కారణం ఏదైనా ఉందా?… ఉంటే అది ఏమిటి? ఇంత పెద్ద సంఖ్యలో జనం చనిపోవడానికి ఆ రహస్య కారణం ఏమిటి? అనే విషయాల్ని పరిశోధించి ప్రజలకు వెల్లడించాల్సిందిగా నేను వైద్యుల్ని, ఆసుపత్రుల యాజమాన్యాలను, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను కోరుతున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో అనుమానాస్పదంగా సంభవిస్తున్న మరణాలపై ఆచూకీ తీయాల్సిన అవసరం ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఎంతో అవసరం.

దేశంలో విశృంఖలంగా పెరుగుతున్న కరోనా రెండో వేవ్ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించింది. ఇలా కేంద్ర ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ అందచేయడం ప్రారంభం కాలేదు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే యవతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారు. విద్యార్ధుల భవిష్యత్తుపై మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య కాలంలో ఎంతో ఆందోళన వ్యక్తం చేసింది. సరైన కాలంలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నందుకు ఎంతో బాధపడింది. అదే సమయంలో మరి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వలేకపోయిందో అర్ధం కావడం లేదు. వ్యాక్సిన్ లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం వెసులుబాటు కల్పించిన స్థితిలో కూడా మనం, మన విద్యార్ధులకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయిన వైఫల్యం ఎందుకు సంభవించిందో తెలియడం లేదు. ప్రభుత్వానికి 25,000 కోట్ల రూపాయల మద్యం ఆదాయం ఇచ్చే ప్రజలు ఉన్న మన రాష్ట్రంలో చాలా మంది వద్ద డబ్బులు ఉన్నాయని భావిస్తున్నందున కనీసం ప్రయివేటు ఆసుపత్రులకు బహిరంగ మార్కెట్ ధరలో వ్యాక్సిన్ వేసేందుకు అయినా అనుమతులు ఇచ్చినా బాగుండేది. బహిరంగ మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ ను మన రాష్ట్రంలో అమ్మే ఒక చీప్ విస్కీ ఫుల్ బాటిల్ రేటులో కొనుగోలు చేసుకోవచ్చు.

దేశంలోని 18- 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 695.7 మిలియన్ మందికి నిర్ణీత వ్యవధిలో వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్దేశించింది. అందుకోసం 10 రాష్ట్రాలకు 67 శాతం డోసులను కేటాయించింది. ఇందులో ఆంధ్ర్రప్రదేశ్ కు 4.1 శాతం వాటా వచ్చింది. 18 సంవత్సరాలు వయసు నిండిన అందరికి 2022 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్దేశిస్తే, మీరు మాత్రం 18 సంవత్సరాలు దాటిన వారికి సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. అప్పటి వరకూ వ్యాధి సంక్రమించకుండా ఉంటుందా….?

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించాలని ప్రయివేటు డాక్టర్లు మాత్రమే సభ్యులుగా ఉన్న ఒక కమిటీ సిఫార్సు చేయగానే మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాన్ ను విధించేసింది. ఇప్పుడు మరింత ఆశ్చర్యకరంగా ఆ కమిటీలో ఉండి, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రయివేటు డాక్టర్లను ఏపి మెడికల్ కౌన్సిల్ కు, ఏపి మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అధిపతులుగా నియమించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు ప్రాక్టీసు చేసుకునే ఈ ఇద్దరు డాక్టర్లకు తగినంత అనుభవం లేదు . అలాంటి వారిని తీసుకువచ్చి ఇంతటి ప్రధానమైన పోస్టుల్లో నియమించడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

పైన చెప్పిన ‘‘విశిష్టమైన’’ డాక్టర్లు ఎవరయా అంటే ఒకరు న్యూరో సర్జన్ అయిన డాక్టర్ శివారెడ్డి, మరొకరు అదే ఆసుపత్రిలో పని చేసే న్యూరాలజిస్టు డాక్టర్ వి.చంద్రశేఖరరెడ్డి. వీరిద్దరూ కూడా పరిపాలనా వ్యవహారాలలో ఏ మాత్రం అనుభవం లేనివారే. ముందు చెప్పిన వ్యక్తిని 2019 ఆగస్టు 28న ఏపి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా నియమించగా, రెండో వ్యక్తిని 2019 ఆగస్టు మొదటి వారంలో ఏపిఎంఎస్ఐడిసికి చైర్మన్ గా నియమించారు. వీరిద్దరూ కూడా మీ వ్యక్తిగత వైద్యులు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం విపరీతంగా ఆలశ్యం కావడం, ఏ కారణం లేకుండా (కరోనా మరణాలు కాదు అని మీరే చెబుతున్నారు కాబట్టి) మన సొంత రికార్డుల ప్రకారమే అత్యధిక సంఖ్యలో, నమ్మశక్యం కాని రీతిలో మరణాల సంఖ్య నమోదు కావడం తదితర అంశాలపై ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలా అకారణంగా లెక్కలేనన్ని మరణాలు సంభవించడంపై మనం సహేతుకమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి అనుమానాస్పద మరణాలు ఇకపై జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటామో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్క రాష్ట్రాలలో ఉండే వైద్యులను కాకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు తెలిసిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఉండే స్థానిక వైద్యుల్ని వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా నియమించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్నది.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు