సీఎం కేసీఆర్ పై వైఎస్‌ షర్మిల ఫైర్

YS Sharmila fires on CM KCR

0
43

హైదరాబాద్: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్బంగా రైతులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని వైసీఆర్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. శనివారం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ ప్రభుత్వ ప్రకటనను నిరసనగా ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద షర్మిల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..పండించే వరకే రైతు పని..ఆ తర్వాత మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు.

రైతులు బానిసలుగా తమ కాళ్లు మొక్కితే తప్ప కొనరా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్‌ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు వడ్లు కొనడం చేతకావడంలేదో కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలు బోనస్‌ ఇచ్చి వడ్లు కొంటున్నాయని ఆయన తెలిపారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ సన్నబియ్యానికి రూ.300 ఎక్కవ ఇచ్చి కొన్నారని గుర్తు చేశారు. మద్దతు ధర అంటే కనీస ధర అని…రైతుకు కనీస ధర ఇస్తామని ప్రకటించి కొనకపోతే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టే అని అన్నారు.

భారం అంతా తెలంగాణ ప్రభుత్వం రైతులపై మోపుతోందన్నారు. మిల్లర్లకు కేసీఆర్ మేలు చేయాలని తరుగు పేరుతో కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సివిల్‌ సప్లయ్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తుందో బట్టబయలవుతుందని షర్మిల పేర్కొన్నారు