YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర తిరిగి నేడు ప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న ప్రారంభం అయిన పాదయాత్ర ఎన్నికల కోడ్ కారణంగా కొండపాక గూడెం దగ్గర పాదయాత్రను నిలిపివేశారు.
కాగా ఈ పాదయాత్రను నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి(మం) కొండపాక గూడెం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. గతంలో 21వ రోజున ఆగిపోయిన అదే గ్రామం నుండి 22వ రోజు పాదయాత్ర మొదలు కానుంది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపాక గూడెం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్‌పల్లి చేరుకుంటారు.
అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఎడవెల్లికి, తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్‌రోడ్డుకు చేరుకుని ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.