మంగళవారానికి షర్మిల పార్టీ కొత్త పేరు

0
121

షర్మిల పార్టీ మంగళవారానికి కొత్త పేరు జత చేసింది. ఇకనుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగవారం గా పరిగణిస్తామని ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరణించిన  కొండల్ మృతికి సంఘీభావంగా, నిరుద్యోగుల కోసం రేపు మంగళవారం షర్మిల నిరాహారదీక్ష చేయనున్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను రూపుమాపేందుకు, కేసీఆర్ నిరంకుశ పాల‌న తీరును ఎండ‌గ‌ట్టేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి వారి కోసం పోరాడాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఈనెల 13వ తేదీ (మంగ‌ళ‌వారం)న ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా, వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడిప‌త్రి గ్రామంలో ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిరుద్యోగుల స‌మ‌స్య‌ల సాధ‌న కోసం, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ నిరుద్యోగ నిరాహార దీక్ష‌ను చేప‌ట్ట‌నున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువ‌కులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రై.. దీక్షకు సంఘీభావం తెల‌పగ‌ల‌రని ఆ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.