Relationship Advice | ఈ మధ్యకాలంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసుకుంటున్నారు. విడాకుల వరకు వెళ్లి వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. పెళ్ళై పట్టుమని సంవత్సరం అయినా కాకుండా ఇలా విడిపోతున్న జంటలు ఎన్నో వున్నాయి. పెళ్లి అంటే ఏమిటి? అది ఓ పవిత్ర బంధం. ఆలూమగలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగసాగరం. ఆనంద సంగమం. ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే ప్రేమానురాగాలతో పాటు కొత్త దంపతుల మధ్య చక్కటి అవగాహన అవసరం. ఎంత ఆన్యోన్య దాంపత్యమైనా అప్పుడప్పుడూ కొన్ని కీచులాటలుండకపోవు. వీటిని ఓవర్ కమ్ చేసి ముందుకు వెళ్లగలిగితే వైవాహిక జీవితం సంతోషంగా గడపొచ్చు అంటున్నారు నిపణులు. బ్యూటిఫుల్ మ్యారీడ్ లైఫ్ కోసం వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
Relationship Advice :
1.భార్యాభర్తలన్నాక అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. ఆ కారణంగా ఎప్పుడైనా చిన్న వాదన జరిగిందనుకోండి. ఆ చిరాకుతో ఆమెను వదలి మీరు బయటకు వెళ్లిపో కండి. సాయంత్రం సరదాగా బయటకు తీసుకెళ్లి మంచి డిన్నర్ ఇప్పించి ప్రేమతో మాట్లాడితే అలకమాయమవుతుంది.
2.మీ గత జీవితం గురించి ఆమెతో అన్నీ నిజాలే చెప్పండి. లేదా ఏమీ చెప్పకుండా ఊరుకోండి. అంతేకాని అబద్ధాలు అస్సలు వద్దు. ఒకవేళ ఆదిగాని బయట పడిందో మీ సంసార నౌక బీటలు వారడం. ఖాయం. ఒక్క చిన్న అబద్ధం ఆడి ఆ తరువాత మీరెంత నిజా యితీగా ఉన్నా లాభం ఉండదు. మిమ్మల్ని ఏ విషయంలోనూ ఆమె పూర్తిగా విశ్వసించదు.
3.ఆమె చేస్తున్న పనిని మెచ్చుకోండి. ఉదాహరణకి ఆరోజు ఆమె ఇల్లు సర్దే కార్యక్రమం పెట్టుకుందనుకోండి. వీలైతే సాయం చేయండి. లేదంటే ‘ఎంత బాగా సర్దావు’ అని చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి. ఆమె ఉద్యోగస్థురాలైతే ఆమె పనిని మనస్ఫూర్తిగా గౌరవించండి.
4.పెళ్లయింది కదాని ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకుని తిరగవద్దు. తన పుట్టింటివాళ్లతో, స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వండి. లేదంటే ఆమె ఆనందాన్నంతటినీ మీరే హరించేశారన్న భావన కలగొచ్చు. అలాగే మీకోసం మీరూ కొంత సమయం కేటాయించుకోండి. లేదంటే మీకంటూ స్నేహితులు లేకుండా అయిపోతారు. మరో ప్రమాదం కూడా ఉంది. కొత్త మోజులో బాగా తిరిగి తరువాత మీ వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉంటే పెళ్లయిన మొదట్లో ఉన్నట్లు ఇప్పుడు ఉండటం లేదని అమ్మాయిలు తెగ బాధపడిపోయే అవకాశాలే ఎక్కువ.
5.ఆమెకు వేరే అమ్మాయిల్ని చూపించి ఆమె ఎంత బాగుందో ఎంత బాగా డ్రెస్ చేసుకుంటుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో, అంటూ పొగడ్తల కార్యక్రమాన్ని చేపట్టకండి. మరొకరితో తనను పోల్చి చూడడం ఏ మహిళా సహించదు. అలా చేస్తే అది కచ్చితంగా మీ వైవాహిక జీవితానికి మైనస్సే అవుతుంది. మీ భార్యకి మీమీద లేనిపోని అనుమానాలు కలిగించినవారవుతారు. బంధుమిత్రుల ముందు మీ అర్ధాంగిని విమర్శించే సాహసం చేయకండి. అలా కానీ చేశారా, మీ కొత్త కాపురం లోని ఆనందానికి అడ్డుకట్ట పడినట్లే. ఈ కాలం అమ్మాయిలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు. జాగ్రత్త. ఏవి ఉన్నా మీరిద్దరే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.
6.కెరీర్, డబ్బు, పుట్టింటి ఇబ్బందులు, ఇలా దేనిగురించో తీరని ఆవేదనలో ఉండి ఆమె మీతో బాధను పంచుకుంటుం దనుకోండి. దాన్ని మీరు తేలికగా కొట్టిపారేయడమో, ఉచిత సలహాలివ్వడమో చేయకుండా ఆమె చెప్పేదాన్ని శ్రద్ధగా వినండి. ఆ సమయంలో సలహాలివ్వడం కన్నా సహనంతో వినడమే ఆమెకు ఎంతో ఊరటనిస్తుంది. అలాగే, కొన్ని సందర్బాల్లో ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆమె చెబుతూనే ఉంటుంది. మీరు మాత్రం అదేమీ చెవికెక్కించుకోకుండా టీవీ చూస్తూనో, పేపరు చదువుకుంటూనే ఉంటే అవతలి వాళ్లకి అరికాలిమంట నెత్తికెక్కుతుంది. మరోసారి అలాంటి విషయాలు మీతో మాట్లాడరు. వేరే వాళ్లతో చెబుతారు. అప్పుడు ఫీల్ అయినా లాభం ఉండదు.
7.మీ పార్టనర్ తో ఎవరైనా నవ్వుతూ మాట్లాడినా ఆప్యాయంగా ఉన్నా చూసి భరించలేకపోతుంటే దాన్ని అసూయ అంటారు. ఇలా కట్టడి చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. భార్య ఆనందంగా ఉండాలనుకోవాలి కానీ ఆమె ఆనందం మీకు మాత్రమే పరిమితం కావాలనుకుంటే అవతలి వ్యక్తులు జైల్లో బంధించినట్లుగా ఫీలయ్యే ప్రమాదం ఉంది. ఒకరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి మరొకరు సంకెళ్లు వేయాలనుకుంటే త్వరలోనే ఇద్దరూ చెరోదారీ కాక తప్పదు.
8. ప్రపంచం మారింది. ఇంటిపనిలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. లాండ్రీకి బట్టలు ఇద్దరివీ కలిపి ఇవ్వండి. ఆమె టిఫెన్ చేస్తుంటే మీరు కాఫీ కలపండి. భోజనాలయ్యాక ఆమె వంటగది సర్దుకుంటుంటే మీరెళ్లి మంచమెక్కకుండా అలసిపోయి నట్లున్నావు. గిన్నెలు నేను సర్దుతాను కాని నువ్వెళ్లి కాస్త ఫ్రెష్ అవు అని చెప్పండి. అపుడు ఆమె కళ్లలో కనిపించే ఆనందాన్ని గుండె లోతుల్లో భద్రంగా దాచుకోండి.
Read Also:
1. రజినీకాంత్ ‘జైలర్’ అప్‌డేట్.. హాట్ స్టెప్పులతో అదరగొట్టిన తమన్నా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat