16 అడుగుల ‘ఓర్‌ ఫిష్’ చేప లభ్యం..శకునం అంటున్న జనం-ఎందుకో తెలుసా?

0
99

సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అందులో అతి పొడవైనవి, బరువైనవి, వింత చేపలు లభిస్తుంటాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ గా మారుతాయి. ఇక తాజాగా చిలీలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారుల బృందానికి 16 అడుగుల పొడవున్న అరుదైన చేప చిక్కింది. ఈ చేపను ‘ఓర్‌ ఫిష్’గా గుర్తించారు. ఇది 5 మీటర్లకుపైగా(16 అడుగులు) పొడవు ఉంది. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి క్రేన్‌కి వేలాడుదీసిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కానీ ఈ చేప కనిపించడంతో జనాలు హడలిపోతున్నారు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. ఓర్ ఫిష్ కనిపించడాన్ని శకునంగా నమ్ముతారు. సునామీ, భూకంపాలు వస్తాయని ఒక విశ్వాసం ఉంది. అయితే ఈ సిద్ధాంతాన్ని సైన్స్ నిర్ధారించలేదు. కాగా ప్రస్తుతం ఈ చేప జలాలపైకి రావడానికి కారణం ఏంటో అధికారులు గుర్తించాలని సూచనలు అందుతున్నాయి. కాగా ఓర్‌ ఫిష్ పొడవు 11 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి సముద్రపు నీటి అడుగున జీవిస్తాయి. అయితే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు వివరించారు. ఈ చేపలు కనిపించడం చాలా అరుదు.

ఎందుకంటే.. సముద్రగర్భం లోతుల్లో జీవించే ఓర్ ఫిష్ భూపొరల్లో కదలికలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రజలాల ఉపరితలానికి చేరతాయని ఓ యూజర్ వెల్లడించాడు. జలాల్లో పైకి వచ్చాయంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్టు సంకేతమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా తొలుత ఈ వీడియోని టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దాదాపు 10 మిలియన్ల ఓట్లు వచ్చాయి.