ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద..34 గేట్లు ఎత్తివేత

0
110

గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణతో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో సైతం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇప్పటికే కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీనితో అధికారులు 34 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087.40 అడుగులకు చేరింది.

ఎస్సారెస్పీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.50 టీఎంసీలుగా ఉంది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,45,500 క్యూసెక్కుల వరద వస్తుండగా..34 గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.