తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలెర్ట్..ఫలితాల విడుదల నేడు లేనట్లే!

0
128

తెలంగాణ టెట్ ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. టెట్ నోటిఫికేషన్ లో జూన్ 27న ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించగా..ఫైనల్ కీ విడుదల కాకపోవడంతో ఆ ప్రక్రియ ఆలస్యం కానుంది. తొలుత ప్రాథమిక కీని విడుదల చేయగా ఈనెల 18వరకు అభ్యంతరాలు స్వీకరించారు. కానీ ఫైనల్ కీని విడుదల చేయలేదు. దీనితో అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు ఫలితాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫలితాలు నేడు విడుదల లేనట్లు తెలుస్తుంది.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. టెట్‌ పరీక్ష పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రిగింది. అలాగే పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది.. ప్రాథమిక కీ టెట్ పేపర్ 1 లో 5  సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పేపర్ 2 లోని ఫైనల్ కీ 5 సమాధానాల్లోనూ తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మార్పులు చేశాకే ఫైనల్ కీ విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే కీ విషయంలోనూ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. అభ్యర్థుల అభ్యంతరాలు పరిశీలనలోకి తీసుకున్నారా… ఫలితాలు విడుదల ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న విషయాల్లో స్పష్టత ఇవ్వడం లేదు. దీనితో అధికారుల తీరుపై టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్‌ పేపర్‌–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్‌ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్‌–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు.