తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందింది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ దేవాలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర ధరలను పెంచుతూ ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో పాటు ఉద్యోగులకు పెంచిన పీఆర్సీతో ఆలయానికి నెలకు దాదాపు రూ.2 కోట్ల భారం పడుతుందని తెలిపారు. అనివార్య పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని ఆమె వివరించారు.
గతంలో వంద గ్రాముల స్వామివారి లడ్డూ రూ.20 ఉండగా, రూ.10 పెంచి మొత్తం రూ.30గా నిర్ణయించారు. అభిషేకం (500 గ్రాముల) లడ్డూ వంద నుంచి రూ.150, సువర్ణ పుష్పార్చన రూ.516 నుంచి రూ.600కు పెరిగింది. వేద ఆశీర్వచనం రూ.516 నుంచి రూ.600కు, నిత్యకల్యాణం రూ.1,250 ఉండగా రూ.1,500కు పెంచారు.
స్వామివారి నిజాభిషేకం రూ.500 నుంచి రూ.800, సహస్ర నామార్చన రూ.216 నుంచి రూ.300కు, లక్ష పుష్పార్చన రూ.2,116 ఉండగా రూ.2,500, స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు రూ.500 ఉండగా రూ.700కు, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో) రూ.500 ఉండగా రూ.800కు పెంచారు. వీటితో పాటు ఆలయంలో భక్తులతో నిర్వహించే వివిధ రకాల పూజల ధరలు కూడా పెంచినట్టు ఈవో గీత తెలిపారు.