మామిడిలో చీడపీడలు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి

Are pests harassing mangoes? Do this though

0
85

మామిడిపండు అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. ఇంకా కొన్ని నెలల్లో మామిడిపండ్ల  సీజన్ వచ్చేస్తుంది. ఈ మామిడిపండ్లు వేసవిలో వస్తాయి. అధికదిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తికోసం సరైన యాజమాన్య పద్దతులను రైతులు పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా తెగుళ్ళ విషయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచి పంట దిగుబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి  పొందాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పురుగులు వేదించినపుడు ఎలాంటి మందులు వాడలో ఇప్పుడు చూద్దాం.

పిండినల్లి: ఇది కాయ నుండి లేత కొమ్మల నుండి రసాన్ని పీల్చి చెట్టును బలహీన పరుస్తుంది. ఇవి విసర్జించిన తేనె వంటి జిగురై మసి తెగులు వృద్థి చెంది పండు నాణ్యతను తగ్గిస్తుంది. ఈ తేనె వంటి పదార్ధం కొరకు చీమలు వస్తాయి. డిసెంబరు, జనవరిలో చెట్టు కాండం, మొదలు చుట్టు పాలథీన్ పేపరు అడుగు వెడల్పులో కట్టాలి. లేదా జిగురు పూసి పిల్ల పురుగులు పైకి పాకకుండా ఆపవచ్చు. చెట్టు చుట్టూ వేసవిలో పాదు చేయాలి. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 2మి.లీ లేదా మిథైల్ డెమటాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు మొదలు కొమ్మలతో సహా పిచికారి చేయాలి

తేనె మంచు పురుగు: లీటరు నీటికి ఫాస్పామిడాన్‌ 0.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్‌ 1.5 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్‌ 3 గ్రాములు లేదా డైమిథోయేట్‌ రెండు మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మిల్లీ లీటర్లలో కలిపి చెట్టులో పూత, పిందె వచ్చే సమయం పూత, ఆకులపై కాకుండా మొదళ్లలో పిచికారి చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారి చేయాలి.

బూడిద తెగులు: వీటిని నీటిలో కరిగే రెండు గ్రాముల గంధకం లేక ఒక మిల్లీ లీటర్‌ కెరాథెన్‌ లేదా ఒక గ్రామ్‌ మైకోబ్యూటనిల్‌ లేదా ఒక గ్రాము బేలటాస్‌ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి పదిహేను రోజుల తర్వాత మందును మార్చి పిచికారి చేయాలి.

పూత బాగా ఉన్నప్పుడు పిచికారి చేసినట్లయితే పుప్పొడి రాలిపోయి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు చనిపోతాయి. ఇక మొగ్గ దశలో కనిపించిన సమయంలో 3 గ్రాముల ఎడల కార్బరిల్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మిల్లీలీటర్‌, ఒక గ్రామ్‌ కార్చండిజమ్‌ ను లీటరు నీటిలో కలిపి వెంటనే పిచికారి చేయాలి. ఆక్లారా 0.1 మిల్లీలీటర్‌ ను ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేస్తే పూత కాపు సమయంలో తేనే మంచు పరుగు సమర్ధవంతంగా నివారించుకోవచ్చు.

కాయపుచ్చు పురుగు: గులాబి రంగు చారతో తెల్లటి లద్దె పురుగు కాయ అడుగున రంధ్రం చేసి తోలును కండను తిని సొరంగాన్ని ఏర్పరుస్తుంది. కాయ లోపలి భాగం పూర్తిగా తినేస్తుంది. ఒక కాయలో 6 నుండి 8 పురుగులు ఉంటాయి. దీని నివారణకు వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. పురుగు కోశస్ధ దశ, ఎండుపుల్లలు, బెరడులో గడుపుతుంది. ఎండిపోయిన మామిడి బెరడును చెట్టునుండి తొలగించాలి. అత్యవసర స్ధితిలో సైపర్ మెత్రిన్ 2ఇ.సి. 0.5మి.లీ లీటరు నీటిలో కలిపి పూత, పిందెపై పిచికారి చేయాలి.

టెంకపురుగు నివారణ: తోతాపురి, నీలం రకాల మామిడిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..అధిక లాభాలు పొందండి..

.