పోలీస్ రాతపరీక్షలో బయోమెట్రిక్‌..అభ్యర్థులకు ముఖ్య సూచనలివే..

0
131

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్.  ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కొన్ని సూచనలు చేసింది. ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 8 గంటల నుంచి బోర్డు వైబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జులై 30న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5న రాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

హాల్‌టికెట్లను ఏ4 సైజ్‌ లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనకవైపు ప్రింటవుట్‌ తీసుకోవాలి.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సరిపోతుంది.

డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి.

దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచినటువంటి ఫొటోనే తిరిగి వినియోగించాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.

ఒకవేళ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లకు కాల్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు. లేదా support@tslprb.in కు మెయిల్‌ పంపి సహాయం పొందొచ్చు.

సూచనలివే..

అభ్యర్థులు సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతిగడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

నగలు ధరించరాదు. హ్యాండ్‌బ్యాగ్‌, పౌచ్‌ తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్‌రూంలు ఉండవు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్నులను మాత్రమే లోనికి తీసుకెళ్లాలి.

ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

పరీక్షలో నెగెటివ్‌ మార్కులున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్‌ చేయాల్సి ఉంటుంది. పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.