తెలంగాణలో ఘనంగా బోనాల పండుగ..ప్రజలకు గవర్నర్​, సీఎం శుభాకాంక్షలు

0
92

తెలంగాణాలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. నేడు (జూలై 24) ఆషాఢ మాసం చివరి రోజు. నేటితో బోనాల పండగ ముగియనుంది. చివరి రోజు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండగ ఘనంగా జరగనుంది.

వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో దశాబ్ధాలుగా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండవర్ణాల గంగా జమునా తెహజీబ్​కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు.  ఎడతెరిపి లేని వానలు, వరదల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం ప్రార్థించారు.