16న “జవాబు కావాలి” పుస్తకావిష్కరణ

0
116

అవసరాలు ఎలా అయితే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయో ప్రశ్నలు అలాగే బుద్ధి వికాసానికి దోహదం చేస్తాయి. ఆదిమ కాలం నుంచి ఈ అత్యాధునిక యుగం దాకా అభివృద్ధి పయనించడానికి ప్రశ్న చేసిన కృషే కారణం. సరే… ఇప్పుడు ఈ ప్రశ్నల ఉపోద్ఘాతం ఎందుకంటే సలీమా తన తొలి కవితా సంపుటిని ‘జవాబు కావాలి’ పేరిట మన ముందుకు తీసుకు వస్తోంది. ఉద్యమ నేపథ్యం ఉన్న సలీమా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి, కవయిత్రి. అంతకుమించి గొప్ప మానవతావాది. వాస్తవిక వాది కూడా. నేల విడిచి సాము చేయడం తన తత్వం కాదు.

ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళే సలీమా కవిత్వంలోనూ అదే ప్రతిబింబిస్తుంది. ఎక్కడా నిరాశకు తావు ఉండదు. ఆమె కవిత్వం చదివిన వారికి కచ్చితంగా ఎంతోకొంత మనోధైర్యం లభిస్తుందనే నమ్మకం నాది.

“ప్రశ్న మొదలవగానే
ఎద భారం కాస్త తగ్గి
మనసులోని భావాలకు
అక్షర రూపమిచ్చింది
తన అసలైన పాత్రను
తనే రచించుకుని
మనిషిగా బతకడం
ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది”

ఇవి ఓ కవితలోని పాదాలు. జవాబు కావాలి సంపుటిని చదువుతున్నంతసేపూ కవయిత్రి ఏవో ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తుందనే అనిపిస్తుంది. పాఠకుల మదిలోనూ ఆ అన్వేషణకు బీజం పడుతుంది. అది అలా కొనసాగుతూ వారిలో ఎంతోకొంత మార్పు తీసుకువస్తుందని చెప్పవచ్చు. సాహితీ రంగంలో కచ్చితంగా మంచి పుస్తకంగా ‘జవాబు కావాలి’ నిలబడుతుందని ఆశిస్తూ సలీమాకు మనసారా అభినందనలు తెలుపుతున్నాను.

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం… షోయబ్ హాలులో ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ హాజరవుతారని ఆశిస్తూ….