తిరుమల టికెట్ల బుకింగ్‌..తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య

0
88

తిరుమల: రేపటి నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ  విడుదల చేసింది. ఈ టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా రోజుకు 25 వేల చొప్పున విడుదలయ్యాయి.

తాజాగా శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్య వల్ల టికెట్లు విడుదల చేసినా…భక్తులు బుకింగ్‌ చేసుకోలేకపోతున్నారు.దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య పరిష్కారానికి తితిదే ప్రయత్నం చేస్తోంది.

ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల చేయగానే వచ్చిన సమస్య…11 గంటల కల్లా పరిష్కరిస్తామని తి.తి.దే వెల్లడించింది. ఆ తర్వాత భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇక తిరుపతి కౌంటర్లలో రోజుకు 20 వేల చొప్పున జారీ చేస్తున్న సర్వదర్శన టికెట్లను… భక్తులు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉంది.