వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. వాటితో ఎంతోమంది మృత్యువాత పడుతుంటారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరగడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాతావరణంలో మార్పుల కారణంగా పిడుగులు పడడం ఎక్కువైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పిడుగులు ఎలా పడుతాయి. పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకాశంలో ఒక మేఘం మరో మేఘంతో ఢీ కొట్టినప్పుడు ఏర్పడే విద్యుత్ ఘాతాన్ని మెరుపు అంటారు. ఆ సమయంలో పెద్ద శబ్దాలు కూడా వస్తాయి. మెరుపు, ఉరుము ఒకేసారి సంభవిస్తాయి. అయితే కాంతి వేగం ధ్వని వేగం కంటే ఎక్కువ కావడంతో ముందు మెరుపు మనకు కనబడి తరువాత ఉరుము వినబడుతుంది. మేఘాల్లో ధనావేశ కణాలు, రుణావేశ కణాలు అనే రెండు రకాల కణాలు ఉంటాయి. ధనావేశ కణాలు తేలికగా ఉంటాయి. కనుక ఇవి మేఘం పై భాగంలో ఉంటాయి. బరువుగా ఉన్న రుణావేశ కణాలు కింది భాగంలో ఉంటాయి. సజాతి ధృవాలు, విజాతి ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో అదే విధంగా మేఘాల్లో ఉండే ఈ కణాలు ఆకర్షించుకుంటాయి.
ఒక మేఘం మరో మేఘంతో ఢీ కొట్టినప్పుడు వాటిలో ఉండే కణాలు ఒక దానితో మరొకటి కలుసుకోవడం వల్ల అక్కడ మిరుమిట్లు గొలిపే మెరుపుతోపాటు పెద్ద శబ్దం ఏర్పడుతుంది. దీనినే మెరుపు, ఉరుము అంటారు. మేఘం భూమికి తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మేఘంలో కింది భాగాన ఉండే రుణావేశ కణాలను భూమి మీద ఉండే ధనావేశ కణాలు ఆకర్షిస్తాయి. ఇలా ఇవి భూమికి చేరడానికి ఏదో ఒక వాహకం అవసరం. కావున ఆ ప్రదేశంలో ఎత్తైన వాటిని ఎంచుకుని వాటి ద్వారా భూమిని చేరుతాయి. అప్పుడు మెరుపుతో పాటు శబ్దం కూడా వస్తుంది. దీనినే పిడుగు అంటారు.
మేఘాల్లోని అణువులు ఒక దానితో మరొకటి ఢీ కొట్టుకోవడం వల్ల ఆకాశం నుండి భూమికి చేరే విద్యుత్ ఘాతాన్నే మనం పిడుగు అంటాం. పిడుగులో భారీ ఎత్తున విద్యుత్ ఉంటుంది. అది మనిషిని అక్కడిక్కకడే బూడిద చేయగలదు.
ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో బండ్ల మీద ప్రయాణించకూడదు. కారులో ఉంటే కారును ఆఫ్ చేసి డోర్లు మూసుకుని కూర్చోవాలి. ఇళ్లల్లో ఉన్న వారు తలుపులు, కిటీకిలు మూసుకుని కూర్చోవాలి. అలాగే మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు షవర్ కింద స్నానం చేయడం కానీ పాత్రలు కడగడం కానీ చేయకూడదు.